Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా థర్డ్ వేవ్ అనివార్యం… ఉదాసీనత వద్దంటూ కేంద్రాన్ని హెచ్చరించిన ఐఎంఏ…

కరోనా థర్డ్ వేవ్ అనివార్యం… ఉదాసీనత వద్దంటూ కేంద్రాన్ని హెచ్చరించిన ఐఎంఏ
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటోన్న దేశం
థర్డ్ వేవ్ ఆసన్నమైందని ఐఎంఏ వెల్లడి
ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని స్పష్టీకరణ
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ పొందాలని పిలుపు

కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. చాలాచోట్ల ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని, పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి కొవిడ్ మార్గదర్శకాలు పాటించడంలేదని వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో, అంకితభావంతో పనిచేసే వైద్య సిబ్బంది, ఆధునిక వైద్య సదుపాయాల సాయంతో ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ ను దాటుకుని వస్తున్నామని ఐఎంఏ వివరించింది.

కానీ, ఇలాంటి వైరస్ మహమ్మారులకు సంబంధించిన ప్రపంచవ్యాప్త చరిత్రను ఓసారి పరిశీలిస్తే థర్డ్ వేవ్ అనివార్యమన్నది స్పష్టమవుతుందని పేర్కొంది. ప్రస్తుత పరిణామాలు కూడా కరోనా థర్డ్ వేవ్ కు సమయం ఆసన్నమైందన్న అంశాన్ని నిరూపిస్తున్నాయని తెలిపింది. గత ఏడాదిన్నరగా దేశం కరోనాను ఎదుర్కోవడంలో అనుభవం సముపార్జించిందని, మరోవైపు అత్యధిక సంఖ్యలో ప్రజలకు వ్యాక్సినేషన్ చేస్తున్నారని, అందువల్ల కరోనా థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఐఎంఏ అభిప్రాయపడింది.

అయితే, ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న దృశ్యాలు బాధాకరమని, కొవిడ్ నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవని ఐఎంఏ పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వాలు, ప్రజలు కరోనా పట్ల తేలికభావంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఇప్పట్లో పర్యాటక కార్యక్రమాలు, భక్తి యాత్రలు, మతపరమైన సమ్మేళనాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. మరికొన్ని నెలల పాటు ప్రజలు ఓపిక పట్టాలని, అప్పటివరకు కఠినమైన రీతిలో కరోనా మార్గదర్శకాలు అనుసరించాలని సూచించింది.

కరోనా సోకిన రోగికి ఆసుపత్రిలో చికిత్స అందించడం కంటే, కరోనా మార్గదర్శకాలు పాటించడం వల్ల కలిగే ఆర్థిక నష్టం ఏమంత పెద్దది కాదని ఐఎంఏ అభిప్రాయపడింది. కనీసం మూడు నెలల పాటు కచ్చితంగా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, తప్పనిసరిగా నియమనిబంధనలు పాటించాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Related posts

ఒమిక్రాన్ కలకలం.. ఆఫ్రికా నుంచి వచ్చిన వందలాది మంది అడ్రస్ లేరు!

Drukpadam

చంద్రబాబుపై కొనసాగుతున్న కేసుల పరంపర…

Drukpadam

బీఎఫ్-7 వేరియంట్ లక్షణాలు ఇవే!

Drukpadam

Leave a Comment