- సీజేఐ జస్టిస్ గవాయ్‌పై దాడిని సమర్థించుకున్న న్యాయవాది రాకేశ్ కిశోర్
- విష్ణు విగ్రహం పిటిషన్‌పై సీజేఐ వ్యాఖ్యల వల్లే దాడి చేశానని వెల్లడి
- చేసిన పనికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని, క్షమాపణ చెప్పనని స్పష్టీకరణ
- ఈ పని దేవుడే చేయించాడంటూ సంచలన వ్యాఖ్యలు
- నిబంధనలకు విరుద్ధంగా బార్ కౌన్సిల్ తనను సస్పెండ్ చేసిందని ఆరోపణ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని న్యాయవాది రాకేశ్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఓ విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన పిటిషన్‌పై సీజేఐ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు.
దేవుడి కోసమే దాడి చేశా.. క్షమాపణ చెప్పను
సెప్టెంబర్ 16న మధ్యప్రదేశ్‌లోని జవారీలో ఉన్న ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణపై సీజేఐ ముందు పిటిషన్ విచారణకు వచ్చిందని రాకేశ్ కిశోర్ గుర్తుచేశారు. ఆ సమయంలో “వెళ్లి మీ దేవుడినే ఏదైనా చేయమని అడగండి” అంటూ సీజేఐ వ్యాఖ్యానించడం తనను కలచివేసిందన్నారు. “న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ, నమ్మకాలను ఎగతాళి చేయకూడదు. పిటిషన్‌ను తిరస్కరించడం అన్యాయం” అని ఆయన పేర్కొన్నారు. తాను హింసకు వ్యతిరేకినని, అయితే ఒక సాధారణ పౌరుడు ఎందుకిలా చేశాడో ఆలోచించాలని అన్నారు.
“నేను ఏ మత్తులోనూ లేను. ఆయన చర్యకు ఇది నా ప్రతిస్పందన మాత్రమే. నాకు భయం లేదు, పశ్చాత్తాపం లేదు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఈ పని దేవుడే చేయించాడు. నన్ను జైలుకు పంపినా, ఉరితీసినా అది ఆయన చిత్తమే” అని రాకేశ్ కిశోర్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం, గుర్తింపు ప్రమాదంలో ఉన్నాయని, ప్రజలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
బార్ కౌన్సిల్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణ
తనను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేయడంపైనా రాకేశ్ కిశోర్ స్పందించారు. న్యాయవాదుల చట్టంలోని సెక్షన్ 35 ప్రకారం, క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసి, నోటీసు ఇచ్చి, తన వాదన విన్న తర్వాతే చర్యలు తీసుకోవాలని, కానీ బార్ కౌన్సిల్ ఆ నిబంధనలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.
దాడిని తీవ్రంగా ఖండించిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్
ఇక, సీజేఐపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట నిరసన తెలిపింది. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
సీజేఐపై బూటుతో దాడికి యత్నం.. స్పందించిన వెంకయ్యనాయుడు
- ఘటనను ఖండించిన మాజీ రాష్ట్రపతి
- ఇది వ్యక్తిగత అంశం కాదని, సమాజానికి సంబంధించిన విషయమని వ్యాఖ్య
- పార్టీ మారిన వారు రాజీనామా చేయాలన్న వెంకయ్యనాయుడు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయ్‌పై బూటుతో దాడియత్నం ఘటనపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండించిన వెంకయ్యనాయుడు, దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం జస్టిస్ గవాయ్‌కి సంబంధిచిన వ్యక్తిగత అంశం కాదని, సమాజానికి, వ్యవస్థకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు.
పార్టీ మారితే రాజీనామా చేయాలి
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మారిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ని సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ మారి కొంతమంది మంత్రులు కూడా అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహరించకూడదని హితవు పలికారు. ప్రజలకు అందించే ఉచిత పథకాలు పరిధి దాటుతున్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి పథకాల కోసం ప్రభుత్వాలు తాహతుకు మించి అప్పులు చేస్తున్నాయని అన్నారు. అప్పులు తీసుకువచ్చేటప్పుడు ఆయా ప్రభుత్వాలు వాటిని ఎలా తీరుస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని, ఇందుకోసం అసెంబ్లీలో చర్చించాలని అన్నారు.