పాలేరు అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి
పనుల్లో వేగం నాణ్యత ముఖ్యమన్న మంత్రి
డిసెంబర్ చివరిలోపు కూసుమంచి జూనియర్ కళాశాల నిర్మాణం పూర్తికి ఆదేశం
ఖమ్మం జిల్లా ఆసుపత్రికి నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యులు అవసరం
ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవనాలపై ఆరా ..
పాలేరు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం, నాణ్యత ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆర్అండ్ బీ, పంచాయతీ రాజ్, విద్యా శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి, దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ నాటికి కళాశాల అందుబాటులోకి కూసుమంచి మండలంలో నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాల భవన పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్ చివరి వరకు నూతన భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టంచేశారు.
సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకంపై దృష్టి
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యంగా, నెఫ్రాలజీ (మూత్రపిండాల వైద్యం), యూరాలజీ వంటి కీలక విభాగాలకు సంబంధించి అనుభవం ఉన్న వైద్యులను వెంటనే జిల్లా ఆసుపత్రికి కేటాయించాలని డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)ను ఆయన చరవాణి ద్వారా సంప్రదించి కోరారు.
ఆరోగ్య కేంద్రాల భవనాలపైనా సమీక్ష
తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల పరిధిలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) భవన నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. తిరుమలాయపాలెంలో రూ. 25 కోట్లతో చేపట్టనున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తైందని, పనులను త్వరలో క్షేత్ర స్థాయిలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఆర్ బీ పనులు వేగవంతం
పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న ఆర్&బీ (రోడ్లు, భవనాలు) శాఖ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, అన్ని పనులూ నాణ్యతతో, సమాంతరంగా జరిగేలా చూడాలన్నారు. ఈ సమీక్షా కార్యక్రమంలో ఆర్&బీ ఎస్ఈ యాకుబ్, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. కళావతి బాయి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు తదితర అధికారులు పాల్గొన్నారు.