జాతీయ వార్తలు

దేశంలో రూ.940 లక్షల కోట్ల బంగారం.. కానీ ఆర్థిక వ్యవస్థకు నిరుపయోగం: కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి

మన దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో సుమారు 50,000 టన్నుల బంగారం నిరుపయోగంగా మూలుగుతోందని కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి వెల్లడించారు. దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 10 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.940 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా వేశారు. అసోచాం నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ సంపద అందుబాటులో ఉన్నా, దేశ ఆర్థికాభివృద్ధికి దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

గత రెండేళ్లుగా బంగారం ధర ఏటా 30శాతం పెరిగినా, దేశంలో కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. భవిష్యత్తులో ధర మరింత పెరుగుతుందనే నమ్మకంతో ప్రజలు బంగారాన్ని కొని బీరువాల్లో భద్రపరుస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత ఆస్తుల విలువ పెరిగినా, అధిక దిగుమతుల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే దిగుమతులు తగ్గడమే కాకుండా, కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) కూడా అదుపులోకి వస్తుందని చౌదరి అభిప్రాయపడ్డారు.

ఈ సమస్యకు పరిష్కారంగా ఫిజికల్ బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌గా (ఈజీఆర్‌) మార్చడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ, ఈజీఆర్‌లను స్టాక్ మార్కెట్‌లో షేర్లలా సులభంగా అమ్మి, కొనుక్కోవచ్చని తెలిపారు. అయితే, భౌతిక బంగారాన్ని ఈజీఆర్‌గా మార్చేటప్పుడు 3శాతం జీఎస్టీ చెల్లించాల్సి రావడం ప్రజలకు, ఆలయాలకు భారంగా మారింది. ఈ కారణంగానే ఈ పథకానికి ఆదరణ లభించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ జీఎస్టీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన సమర్పించినట్లు ఆయన వివరించారు.

Related posts

తమిళనాడులో గూడ్స్ రైలును ఢీకొట్టిన దర్భంగా ఎక్స్‌ప్రెస్!

Ram Narayana

ఆర్బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా…

Ram Narayana

ఇకపై ‘పంచాయతీ వాతావరణ సేవ’.. భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన

Ram Narayana