- పెద్దెముల్ మండలం గొట్లపల్లిలో నామినేషన్ పత్రాల చోరీ
- పంచాయతీ కార్యాలయం తాళాలు పగలగొట్టిన దుండగులు
- మూడు గ్రామాలకు చెందిన పత్రాలు అదృశ్యం
- ఎన్నికల ప్రక్రియకు ఆటంకం లేదన్న అధికారులు
- ఆన్‌లైన్‌లో వివరాలు భద్రంగా ఉన్నాయని వెల్లడి
వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కలకలం రేగింది. గొట్లపల్లి క్లస్టర్‌కు చెందిన నామినేషన్ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి పలు నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. అయితే, వివరాలన్నీ ఆన్‌లైన్‌లో భద్రంగా ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళితే.. గొట్లపల్లి, హన్మపూర్, గిర్మాపూర్, జైరాం తండా (ఐ) గ్రామాలకు కలిపి గొట్లపల్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఉదయం పంచాయతీ సిబ్బంది కార్యాలయాన్ని తెరిచేందుకు వెళ్లగా, తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపల నామినేషన్ పత్రాలు చిందరవందరగా పడి ఉండటంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్‌ఓ కోటయ్య, ఏఆర్‌ఓ అంజయ్య పరిశీలించగా.. హన్మాపూర్, గిర్మాపూర్, జైరాం తండా గ్రామాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలు కనిపించలేదు. సమాచారం అందుకున్న ఎస్సై శంకర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కొన్ని పత్రాలు భౌతికంగా కనిపించకపోయినా, అన్ని నామినేషన్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశామని తెలిపారు. అందువల్ల ఎన్నికల ప్రక్రియ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరం.. సర్పంచ్ ఎన్నికల్లో తండ్రీకొడుకుల మధ్య పోటీ!
- ఝాన్సిలింగాపూర్ గ్రామంలో పోటీ పడుతున్న తండ్రీకొడుకులు
- నామినేషన్ దాఖలు చేసిన తండ్రి రామకృష్ణయ్య, కొడుకు వెంకటేశ్
- సర్పంచ్ పదవికి గ్రామంలో 10 నామినేషన్లు దాఖలు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులను వేలం వేస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఈ వేలం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో బంధువులు, స్నేహితులు పోటీ పడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సిలింగాపుర్ గ్రామంలో తండ్రీకొడుకులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఝాన్సిలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి తండ్రి మానెగళ్ల రామకృష్ణయ్య, కుమారుడు వెంకటేశ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ గ్రామంలో 1,563 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ స్థానానికి మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి.
నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో కనకదుర్గమ్మ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. వేలం వేయగా సర్పంచ్ పదవిని రూ. 73 లక్షలకు మహమ్మద్ సమీనా ఖాసీమ్ అనే మహిళ దక్కించుకున్నారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోనూ వేలం పాటలో ఒక వ్యక్తి సర్పంచ్ పదవిని దక్కించుకోగా, గ్రామస్తులు కొందరు సర్పంచ్ వేలంపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి 10 మందిని బైండోవర్ చేసినట్లు తహసీల్దారు తెలిపారు.