పనితీరు …పల్లె తీర్పు …కాంగ్రెస్ కు వార్నింగ్
గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ యస్…ప్రభావం చూపని బీజేపీ
మంత్రుల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన పంచాయతీలు
కొందరు మంత్రులను తొలగిస్తారని హోరెత్తుతున్న ప్రచారం
నిన్న జరిగిన రెండొదశ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పనితీరుకు అద్దం పట్టాయి ..అధికార పార్టీ పనితీరును బట్టే పల్లె తీర్పు ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ..అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు వార్నింగ్ బెల్ మోగింది …ప్రజల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరుపై ఓటు ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించారు ..ప్రతిపక్ష బీఆర్ యస్ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది ..ఆ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్ మాటిమాటికి చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజంలేదని పల్లె ప్రజలు తేల్చి చెప్పారు ..మంత్రులు ప్రజలతో వ్యవహరిస్తున్న తీరుపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేశారు … కొందరు మంత్రులు తమకు మంత్రి పదవి రాగానే ప్రజలను పట్టించుకోవడం మానేశారని విమర్శలు ఉన్నాయి..కనీసం వారి గోడు కూడా వినిపించుకోవడంలేదని ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు ..మరికొందరు పదవులు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు …మంత్రులు నియోజకవర్గాల్లో చుట్టపు చూపు పర్యటనలు చేస్తూ మిగతా సమయాన్ని తమ సొంత పనులు చూసుకుంటూ హైద్రాబాద్ లోనే మకాం వేస్తున్నారని విమర్శలను ఎదుర్కొంటున్నారు ..దీంతో అధికార పార్టీ హవా పై నీలినీడలు అలుముకున్నాయి…దీనికితోడు ప్రజలకు ఇచ్చిన ప్రధానమైన వాగ్దానాలు నెరవేర్చలేదని మహిళలకు ఇస్తానన్న పెన్షన్లు మాటలకే పరిమితం కాగా 4 వేల రూపాయలు పెన్షన్లు ఎప్పుడు అమలుకు నోచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొన్నది …ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలు ఇదిగో అదిగో అంటున్నారు తప్ప వాటిని విడుదల చేయడంలేదు …రిటైర్ అయిన ఉద్యోగులు వారు దాచుకున్న సొమ్ములు కూడా చెల్లించకపోవడం వారు ఆగ్రహంగా ఉన్నారు . ఇదే పద్దతి కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి తప్పదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు …ఎన్నికల ఫలితాలను చూసైనా సమీక్షా జరుపుకుని సరిచేసుకోకపోతే ఇబ్బందులు తప్పవుమరి …!

- సగానికి పైగా సర్పంచ్ స్థానాలు హస్తం కైవసం
- గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్
- సిద్దిపేట, జనగామ వంటి జిల్లాల్లో గులాబీ పార్టీ పట్టు
- చలిని లెక్కచేయకుండా భారీగా పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు
తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి విడత తరహాలోనే మలి విడతలోనూ అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సగానికి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.
మొత్తం 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు 2,200కు పైగా స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిచ్చి 1,100కు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ సుమారు 250 స్థానాలకే పరిమితమైంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయడంతో మెజారిటీ జిల్లాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. అయితే సిద్దిపేట, జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది.
తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 85.86 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నిన్న సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టి, గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల వివరాలను అధికారులు ప్రకటించారు.