సామినేని రామారావు హత్య కేసు: కోర్టులో లై డిటెక్టర్ పరీక్షల అనుమతికోసం పోలీసుల పిటిషన్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో ఖమ్మం పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో అనుమానితులు, సాక్షులు సహా మొత్తం 24 మందికి లై డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ ఖమ్మం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత అక్టోబర్ 31వ తేదీన సీపీఎం నాయకుడు సామినేని రామారావు ఆయన స్వగ్రామమైన చింతకాని మండలం పాతర్లపాడులో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు పురోగతి లభించలేదు. పలువురు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు సహా సుమారు 30 మంది వరకు టీంలుగా వేర్వేరు కోణాల్లో దర్యాప్తు జరిపినప్పటికీ, హత్యకు గల కారణాలు , హంతకులెవరనేది తేల్చలేకపోయారు ..దీంతో ఈ కేసులో పోలిసుల తీరు విమర్శలు దారితీసింది .. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సిపిఐ ఫ్లోర్ లీడర్ కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు లేవనెత్తారు ..ఇది ఇక మిస్టరీగా మారిందని దీనిపై సిట్ ఏర్పాటు చేసి నిందులను పట్టుకోవాలని కోరారు ..
వివిధ కోణాలనుంచి వస్తున్న వత్తిడిలతో ఖమ్మం జిల్లా పోలీసు శాఖ కేసులో నిందితులను తేల్చేందుకు లై డిటెక్టర్ పరీక్షలు చేస్తేగాని నిందితులను పట్టుకోలేమని నిర్దారణకు వచ్చింది .దీంతో అనుమానితులుగా భావిస్తున్న 24 మందికి లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టును అభ్యర్థించింది. ఇటువంటి పరీక్షల అంశంలో అనుమానిత వ్యక్తులుగాని, సాక్షులుగాని అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా పరీక్షలకు కోర్టు అనుమతించే అవకాశమున్నట్లు తెలుస్తుంది . పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై మొత్తం 24 మందిలో ఆరుగురు మాత్రమే ఇప్పటి వరకు లై డిటెక్టర్ పరీక్షలకు అంగీకరించారు. దీంతో వారికి ఆయా పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు వారిని బెంగళూరుకు సోమవారం తరలించారు.ఇక కోర్ట్ ఇచ్చే సూచనలు మేరకు పోలీస్ శాఖ ఈ కేసులో ముందుకు వెళ్లనున్నది ..