తెలంగాణ వార్తలు

విజయారెడ్డి ఆత్మహత్య మిస్టరీ.. ‘అంతా ఒక కలలా ఉంది’ అంటూ భర్త కన్నీరు!

  • కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేవన్న సురేందర్‌రెడ్డి
  • జనవరి 29న చివరి ఫోన్ కాల్ చేసిందన్న భర్త
  • ఫోన్, ల్యాప్‌టాప్ డేటాపైనే పోలీసుల ఆశలు

“నా భార్య చాలా ధైర్యవంతురాలు.. ఇంట్లో ఆమె మాటే శాసనం. పిల్లలకు తల్లి అంటే ప్రాణం. అంతా ఒక కలలా ఉంది.. అందరూ ఒక్కసారిగా తిరిగి వస్తే బాగుండు” అంటూ దుబాయ్‌లో ఉంటున్న సురేందర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య విజయారెడ్డి, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన మొదటిసారి స్పందించారు. బీబీనగర్‌లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు.

జనవరి 29న విజయారెడ్డి తనతో చివరిసారిగా మాట్లాడిందని సురేందర్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో పిల్లల భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి చర్చించుకున్నారే తప్ప ఎక్కడా ఆమె మాటల్లో ఆందోళన కనిపించలేదన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో విజయారెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకునేదని ఆయన గుర్తు చేసుకున్నారు. వచ్చే మార్చి నెలలో తను ఇంటికి రావాలని ప్లాన్ చేసుకున్నానని, ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని వాపోయారు.

కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, ఆర్థికపరమైన సమస్యలు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. మరి అంత ధైర్యవంతురాలైన మహిళ, ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలను ఒప్పించి మరీ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటన్నది ఇప్పుడు అంతుచిక్కడం లేదు. “పోలీసుల విచారణలోనే అసలు నిజం బయటపడాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు రైల్వే పోలీసులు ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు. విజయారెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటి డేటా రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీ ఆధారంగా విశ్లేషిస్తే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆ ‘బలమైన కారణం’ ఏంటో వెలుగులోకి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

Related posts

తెలంగాణ ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులపై కేంద్రరానికి బీఆర్ యస్ ఫిర్యాదు …

Ram Narayana

వైర్లు, బ్యాటరీ లేని పేస్‌మేకర్.. వృద్ధుడికి కొత్త జీవితం ప్రసాదించిన నిమ్స్!

Ram Narayana

జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడులు…

Ram Narayana