ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!
ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
పుర పోరులో కాంగ్రెస్ ప్రభంజనం.. 80 శాతం పైగా స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోందని, దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని వెల్లడించారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్యాపింగ్ కోసం ఎక్కడెక్కడ ఎక్విప్‌మెంట్ (పరికరాలు) అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తోందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం

“ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తోంది. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పేముందని, తన పార్టీ తరపున తాను అడిగానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం పైగా సీట్లు కాంగ్రెస్ వే
రేపు (బుధవారం) జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. “గడిచిన రెండేళ్లలో మేం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజలకు చేరువయ్యాం. అందుకే ఈ పుర ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. ఇది జీర్ణించుకోలేకే ప్రతిపక్ష నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విసిరిన సవాళ్లను ప్రజలు తిప్పికొట్టారు.. అదే ఫలితం రేపు పునరావృతం కాబోతుంది” అని అన్నారు.
అభివృద్ధికి పెద్ద పీట…
గత ప్రభుత్వ తీరుపై పొంగులేటి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ధనిక తెలంగాణను రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. నెలకు రూ. 6,300 కోట్లు కేవలం అప్పులకే కడుతూ కూడా సంక్షేమాన్ని ఆపలేదు. గత దొరల పాలనలో పేదలను విస్మరించారు. 62 వేల డబుల్ బెడ్ రూంలను మొండిగోడలుగా మిగిల్చారు. కానీ మేం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ‘వరి వేస్తే ఉరి’ అన్న కాలం పోయి, ఇప్పుడు వడ్లకు బోనస్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం” అని వివరించారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారానే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.