తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఏడింట 5 కార్పొరేషన్‌లు కాంగ్రెస్ కైవసం.. 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా

Telangana Congress wins 5 corporations elections postponed in 11 municipalities
  • రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండలను దక్కించుకున్న కాంగ్రెస్
  • కరీంనగర్‌లో బీజేపీ, కొత్తగూడెంలో సీపీఐ విజయం
  • జనగాం, తొర్రూర్, క్యాతనపల్లి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా

తెలంగాణలో ఐదు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీజేపీ, సీపీఐ పార్టీలు చెరో కార్పొరేషన్‌ను దక్కించుకున్నాయి. రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్, కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ, కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ దక్కించుకున్నాయి.

రామగుండం, మంచిర్యాల, మహబూబ్ నగర్, నల్గొండలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది. నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీకి అవకాశాలు ఉన్నప్పటికీ, మజ్లిస్ పార్టీ మద్దతుతో దీనిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్‌గా 49వ వార్డు కార్పొరేటర్ ఉమారాణి, డిప్యూటీ మేయర్‌గా మజ్లిస్ పార్టీ 54వ వార్డు కార్పొరేటర్ సల్మా తహసీన్ ఎన్నికయ్యారు.

కోరం లేకపోవడం వల్ల 11 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. జనగాం, తొర్రూరు, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు.

  • బీజేపీ, ఇతరులు మద్దతివ్వడంతో ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన శిరీష
  • ఆలియాబాద్‌లో 20కి గాను ఎనిమిది స్థానాలు గెలిచిన కాంగ్రెస్
  • ఏ పార్టీకి రాని సంపూర్ణ మెజారిటీ

తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. హంగ్ వచ్చిన చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీని బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఆలియాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌కు చెందిన కంఠం శిరీష ఎన్నికయ్యారు. బీజేపీ, ఇతరుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతమైంది.

ఆలియాబాద్ మున్సిపాలిటీలోని 20 స్థానాలకు గాను కాంగ్రెస్ ఎనిమిది, బీఆర్ఎస్ ఏడు, బీజేపీ మూడు, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీని దక్కించుకుంది.

నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రకటించారు. నల్గొండలో 48కి గాను కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఇతరులు 8 స్థానాలను గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో బుర్రి చైతన్య మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ డిప్యూటీ మేయర్‌గా మహమ్మద్ ఆశ్రఫ్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు.

తొర్రూరులో ఉద్రిక్తత… ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై దాడి

Errabelli Dayakar Rao PA Attacked in Thorrur Election Tension
  • తొర్రూరులో బీఆర్ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 స్థానాలు
  • ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకున్న కడియం కావ్య
  • కావ్య వరంగల్‌లో కూడా నమోదు చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపణ
  • ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, ఎర్రబెల్లి పీఏపై దాడి

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఉన్న చోట ఎన్నిక సజావుగా సాగుతోంది. హంగ్ వచ్చిన చోట ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొర్రూర్‌లో 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులను గెలుచుకున్నాయి. ఎక్స్‌అఫీషియో సభ్యుల వివాదం లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఛైర్‌పర్సన్‌ను దక్కించుకోవాలి.

కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఎక్స్అఫీషియోలుగా పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. డ్రా ద్వారా ఎన్నికను నిర్వహించే అవకాశముంది.

అయితే కడియం కావ్య ఇదివరకే వరంగల్‌లో ఎక్స్అఫీషియోగా నమోదు చేసుకున్నారని, ఇప్పుడు మళ్లీ తొర్రూరులో ఎలా చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. వారిమధ్య తోపులాట జరిగింది.

ఆ సమయంలో అక్కడకు కడియం కావ్య, యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి పీఏపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కడియం కావ్య రెండుచోట్ల ఎక్స్ అఫీషియోగా నమోదు చేయించుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ.. ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్

Kolagani Srinivas Elected Karimnagar MayorBJP Wins
  • మేయర్‌గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్
  • శ్రీనివాస్‌కు 34, కాంగ్రెస్ అబ్యర్థి నర్మదకు 21 ఓట్లు
  • కాంగ్రెస్‌కు మద్దతు పలికిన మజ్లిస్, ఇతరులు

పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.  కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది.

బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి నర్మదకు 21 ఓట్లు వచ్చాయి. తొమ్మిది స్థానాలు ఉన్న బీఆర్ఎస్ ఎన్నికను బహిష్కరించింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 స్థానాలు ఉండగా, బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, మజ్లిస్ 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. బీఆర్ఎస్, మజ్లిస్, స్వతంత్రులతో కలిపి కరీంనగర్ కార్పొరేషన్‌ను దక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది.

కరీంనగర్ కార్పొరేషన్‌లో తమకు అధికారానికి కావాల్సిన స్థానాలు దక్కలేదు కాబట్టి తాము మేయర్ ఎన్నికను బహిష్కరించామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెల్లడించారు. తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించామని అన్నారు. తమకు మెజారిటీ స్థానాలు వస్తే తాము మేయర్ పదవి కోసం బరిలో నిలిచేవాళ్లమని వెల్లడించారు.

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక: ఆదిలాబాద్‌లో బీజేపీకి, బైంసాలో మజ్లిస్ పార్టీకి షాక్

Adilabad Municipal Election BJP Shock in Bainsa Majlis Party
  • ఆదిలాబాద్‌లో 49కి గాను 21 వార్డుల్లో గెలిచినప్పటికీ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్రుల మద్దతుతో బండారి అనూష గెలుపు
  • భైంసాలో స్వతంత్రులకు మద్దతిచ్చిన బీజేపీ

తెలంగాణలో కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక కొనసాగుతోంది. అయితే ఆదిలాబాద్‌లో బీజేపీ, భైంసాలో మజ్లిస్ పార్టీలకు షాక్ తగిలింది. ఈ మున్సిపాలిటీల్లో ఆయా పార్టీలు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ ఈరోజు జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలను దక్కించుకోలేకపోయాయి.

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఇతరులు 11 స్థానాల్లో గెలిచారు. 25 మంది సభ్యుల మద్దతు ఉంటే మున్సిపాలిటీని దక్కించుకోవచ్చు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ ఈ స్థానాన్ని దక్కించుకుంటుందని భావించినప్పటికీ, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బండారి అనూష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

ఎక్స్‌అఫీషియోతో కలిపి 51 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్రుల మద్దతుతో కలిపి ఆమె పదవిని దక్కించుకున్నారు. బండారి అనూషకు 27 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. టిక్కెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పలు పార్టీల మద్దతుతో ఛైర్‌పర్సన్ అయ్యారు. వైస్ ఛైర్మన్‌గా 44వ వార్డు మజ్లిస్ అభ్యర్థి మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. బీజేపీ తరఫున ఛైర్‌పర్సన్‌ బరిలోకి దిగిన జోగు శైలజకు 23 ఓట్లు వచ్చాయి.

భైంసాలో 42 వార్డులకు మజ్లిస్ పార్టీ (12) అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో ఈ మున్సిపాలిటీని మజ్లిస్ దక్కించుకుంటుందని భావించారు. కానీ బీజేపీ సహకారంతో స్వతంత్రులు పీఠం ఎక్కారు. మజ్లిస్ పార్టీకి మున్సిపాలిటీ దక్కకుండా బీజేపీ చక్రం తిప్పింది. భైంసా మున్సిపల్ ఛైర్మన్‌గా స్వతంత్ర అభ్యార్థి తూము దత్తాత్రి, వైస్ ఛైర్మన్‌గా బీబీ ఖతీజా సిద్ధిఖీ ఎన్నికయ్యారు. కాగా, స్వతంత్రుల్లో అత్యధికులు బీజేపీ రెబల్ అభ్యర్థులు అని సమాచారం.

టర్మ్ పూర్తయ్యేలోపు బీజేపీ పీఠం ఎక్కుతుంది… ఇది నా మాట!: ధర్మపురి అర్వింద్

Dharmapuri Arvind vows to reverse Nizamabad Corporation scene
  • నిజామాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయన్న అర్వింద్
  • మూడు పార్టీలు కలిసి బీజేపీని ఓడించాయని వ్యాఖ్య
  • కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్న

నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీని ఓడించి కార్పొరేషన్ ను కైవసం చేసుకున్నాయని మండిపడ్డారు. స్వల్ప మెజార్టీతో తాము మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కోల్పోయామని చెప్పారు. ఈ మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ పూర్తి కాకముందే మేయర్ పీఠాన్ని బీజేపీ ఎక్కుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ఇది నా మాటగా చెబుతున్నాను. మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ ముగిసేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తాం” అని అర్వింద్ అన్నారు. ఇక్కడికి అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చి హిందువులను దూషించినా… ఆత్మాభిమానాన్ని చంపుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో కలిసిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు.

కాళేశ్వరం, కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఈ పొత్తుల వెనుక ఆ రహస్యాలు దాగున్నాయని ఆరోపించారు.

పోలీసులు కూడా రాజకీయ రంగుపులుముకుని బీఆర్ఎస్ కార్పొరేటర్‌ను ఎత్తుకెళ్లి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేలా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో మేయర్ ఓటింగ్‌కు దూరంగా ఉన్న బీఆర్ఎస్… నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “కరీంనగర్ మీదనే ఎందుకు ప్రేమ? నిజామాబాద్ మీద ఎందుకు లేదు?” అని ప్రశ్నించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డిలకు నార్కో పరీక్షలు చేస్తే నిజం బయటపడుతుందని అన్నారు.

 నల్గొండను దేశం గర్వించేలా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: కోమటిరెడ్డి

Komatireddy Aims to Develop Nalgonda into Nationally Admired City
  • నల్గొండ మేయర్, డిప్యూటీ మేయర్లకు కోమటిరెడ్డి అభినందనలు
  • తన మనసు గర్వంతో నిండిపోయిందని వ్యాఖ్య
  • ఓడిపోయిన డివిజన్లలో కూడా అభివృద్ధిని కొనసాగిస్తామన్న మంత్రి

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లను ఈరోజు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ… నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు తన జీవిత కల అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. నూతన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. 

నల్గొండ తన జన్మభూమి అని కోమటిరెడ్డి అన్నారు. నల్గొండలోని ప్రతి గల్లీ తన గుండెచప్పుడు అని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రమాణస్వీకారం చేస్తుంటే… తన మనసు ఎంతో గర్వంతో నిండిపోయిందని అన్నారు. నల్గొండను దేశం గర్వించేలా క్లీన్ అండ్ గ్రీన్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. 

“రాజకీయాలకు తావు లేకుండా, మేము ఓడిపోయిన డివిజన్లలో కూడా అభివృద్ధిని కొనసాగిస్తాం. ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమం, ప్రతి వీధికి ఆధునిక వసతులు చేరేలా చూడడమే నా బాధ్యత” అని మంత్రి ప్రకటించారు. “నాటి ఫ్లోరోసిస్ వ్యతిరేక పోరాటం నుంచి నేటి స్మార్ట్ సిటీ నిర్మాణం వరకు… మీ కోమటిరెడ్డి ఎప్పుడూ మీ తోడుగానే ఉంటాడు. మనందరం కలిసి నవ నల్గొండను నిర్మిద్దాం” అని పిలుపునిచ్చారు.

  1. మంచిర్యాల కార్పొరేషన్

మేయర్ – మధుకర్ (కాంగ్రెస్)
డిప్యూటీ మేయర్ – రమ్య మహేశ్ (కాంగ్రెస్)

  1. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ – ఉమారాణి ( కాంగ్రెస్ )
    డిప్యూటీ మేయర్ – సల్మా తహసీన్ ( ఎంఐఎం )
  2. రామగుండం కార్పొరేషన్

మేయర్ – మహంకాళి స్వామి (కాంగ్రెస్)
డిప్యూటీ మేయర్ – పాతిపెల్లి ఎల్లయ్య (కాంగ్రెస్)

  1. కొత్తగూడెం కార్పొరేషన్

మేయర్ – మూడ్ గణేశ్ (సీపీఐ)
డిప్యూటీ మేయర్ – సిరిపురపు లలిత కుమారీ (కాంగ్రెస్)

  1. నల్గొండ కార్పొరేషన్

మేయర్ – ముర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్)
డిప్యూటీ మేయర్ – మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్

  • 6.మహబూబ్‌నగర్ కార్పొరేషన్

మేయర్ – గుమల్ మమత (కాంగ్రెస్)
డిప్యూటీ మేయర్ – సురేందర్ రెడ్డి (కాంగ్రెస్)

  • 7.కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ – కొలగాని శ్రీనివాస్ ( బీజేపీ )
    డిప్యూటీ మేయర్ – సునీల్ రావు ( బీజేపీ )

Related posts

రేవంత్ రెడ్డివి అన్నీ అబద్ధాలే … క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్ డిమాండ్

Ram Narayana

ఖమ్మం జిల్లా మంత్రులకు పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జిల భాద్యతలు

Ram Narayana

కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు తొత్తులు అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కామ్రేడ్స్ గరంగరం …

Ram Narayana