- తన వర్గానికి చెందిన కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదని జీవన్ రెడ్డి ఆగ్రహం
- మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నానన్న జీవన్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమిండ్ల వాణి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తన వర్గానికి చెందిన కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, అవమానాలను ఇంకా ఎంత కాలం భరించాలని వాపోయారు.
వలసవాదికి ఛైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా, స్వతంత్రులుగా ఎన్నికైన తన అనుచరులను ప్రజాభవన్‌కు తీసుకువెళ్లి కూడా చూపించానని తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పని చేసిన వారికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర నాయకులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
కానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన వారికే పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఆయన మనుషులకు టిక్కెట్లు ఇవ్వడంతో పాటు మున్సిపల్ ఛైర్మన్ పదవి కూడా ఇవ్వడం దారుణమని అన్నారు. పార్టీ కోసం జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, కానీ మనం అధికారంలోకి వచ్చాక సొంత వారికి అన్యాయం జరగడం చాలా బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేనప్పుడు తానేం చేయగలనని అన్నారు.