- బంగ్లా 11వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎన్‌పీ ఛైర్మన్ తారిక్
- ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రతినిధిగా హాజరైన స్పీకర్
- బంగ్లా నూతన ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని విదేశాంగ శాఖ ప్రకటన
బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తారిక్ రెహమాన్‌తో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం భేటీ అయ్యారు. ఢాకాలో జరిగిన ఈ సమావేశంలో, ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు తారిక్ రెహమాన్‌కు ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఆయన్ను భారత్‌లో పర్యటించాలని సాదరంగా ఆహ్వానించారు. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఛైర్మన్ అయిన తారిక్ రెహమాన్, దేశ 11వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఢాకాలోని నేషనల్ పార్లమెంట్ సౌత్ ప్లాజాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్.. తారిక్ రెహమాన్‌తో ప్రధానిగా ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు బీఎన్‌పీ కీలక నేతలు మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్, అమీర్ ఖస్రు మహమూద్ చౌదరి, సలావుద్దీన్ అహ్మద్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా ఓం బిర్లా తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. “ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమ్మిళిత దేశ నిర్మాణంలో బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. తారిక్ రెహమాన్ ఏర్పాటు చేసిన క్యాబినెట్‌లో 25 మంది మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు, ముగ్గురు టెక్నోక్రాట్‌లు ఉన్నారు.
ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. “ఈ కీలక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన, చిరకాల స్నేహబంధాన్ని చాటుతోంది. ప్రజాస్వామ్య విలువలకు భారత్ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటిస్తున్నాం” అని తెలిపింది. తారిక్ రెహమాన్ నాయకత్వానికి ప్రజలు బలమైన తీర్పు ఇచ్చారని, ఆయన నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.