- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
- క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునే కుట్రలో భాగమే ఈ అరెస్ట్ అని ఆరోపణ
- అధికార పార్టీకి కొందరు పోలీసులు తొత్తులుగా మారారని విమర్శ
- సుమన్‌ను బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని ఆయన మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని అడ్డదారుల్లో కైవసం చేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే కాంగ్రెస్ ఈ కుట్రకు తెరలేపిందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికీ వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుందని కేటీఆర్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకుంటే మంచిదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ… “క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి దౌర్జన్యంగా దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ కుట్రలో భాగంగానే సుమన్‌పై అక్రమ కేసులు బనాయించి, ఇవాళ దుర్మార్గంగా అరెస్ట్ చేయించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా క్యాతన్‌పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు” అని విమర్శించారు.
కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. వారు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను ప్రభుత్వం తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.