- తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల
- మార్చి 16న పోలింగ్, అదే రోజు కౌంటింగ్
- అసెంబ్లీ బలం రీత్యా రెండు సీట్లూ కాంగ్రెస్‌కే ఖాయం
- అభ్యర్థులుగా సింఘ్వీ, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్ల పరిశీలన
- రేసులో పలువురు సీనియర్ నేతలు, ఆశావహులు
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 16న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ, బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
శాసనసభలో ప్రస్తుత బలాబలాల ప్రకారం ఈ రెండు స్థానాలనూ అధికార కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుచుకోనుంది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమికి సుమారు 77 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో రెండు సీట్ల గెలుపు లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.
కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఒక స్థానాన్ని మళ్ళీ అభిషేక్ మను సింఘ్వీకే కేటాయించే అవకాశాలున్నాయి. కేవలం ఏడాదిన్నర క్రితమే ఆయన రాజ్యసభకు ఎన్నికైనందున, ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో స్థానం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో విపక్షాల తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన సుదర్శన్‌రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
ఈ రెండు పేర్లతో పాటు, సీనియర్ నేత వి. హనుమంతరావు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కార వేణుగోపాల్ వంటి పలువురు ఆశావహులు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషంలో అనూహ్యమైన పేర్లు తెరపైకి రావడం సాధారణమేనని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 26న విడుదల కానుండగా, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ మార్చి 5. మార్చి 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అవసరమైతే మార్చి 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.