- లక్నో నుంచి నాసా వరకు భారత సంతతి మహిళ విజయ ప్రస్థానం
- హబుల్, జేమ్స్ వెబ్ టెలిస్కోపుల నిర్మాణంలో కీలక పాత్ర
- అడ్డంకులను అధిగమించి ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్ సాధించిన వైనం
- ప్రస్తుతం నాసా ప్రధాన కార్యాలయంలో సీనియర్ సైంటిస్ట్‌గా సేవలు
లక్నోలో పుట్టి పెరిగి, అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనే కలను నిజం చేసుకున్నారు భారత సంతతి మహిళ హషీమా హసన్. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)లో సీనియర్ శాస్త్రవేత్తగా ఎదిగిన ఆమె, ప్రపంచ ప్రఖ్యాత హబుల్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
1957లో రష్యా ప్రయోగించిన ‘స్పుత్నిక్’ ఉపగ్రహాన్ని ఆకాశంలో చూడడం కోసం ఏడేళ్ల వయసున్న తనను, ఇంట్లోని వారినీ తమ నాయనమ్మ తెల్లవారుజామునే ఇంటి పెరట్లోకి తీసుకెళ్లేదని హషీమా చెప్పింది. దానిని చూసినప్పుడే తాను కూడా స్పేస్ సైంటిస్ట్ కావాలని నిర్ణయించుకున్నానని ఆమె అన్నారు. ఆనాటి ఆ బలమైన కోరికే ఆమెను నేడు నాసాలో అత్యున్నత స్థాయికి చేర్చింది. మహిళలు సైన్స్ రంగంలోకి రావడం అరుదుగా ఉన్న రోజుల్లోనే హషీమా పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌పై న్యూక్లియర్ ఫిజిక్స్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. అనంతరం 1985లో తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లారు.
నాసా ప్రయోగించిన హబుల్ స్పేస్ టెలిస్కోప్‌లో తొలినాళ్లలో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిదిద్దడంలో హషీమా కీలక పాత్ర పోషించారు. తన నైపుణ్యంతో టెలిస్కోప్ ఫోకస్‌ను సరిచేసి, ప్రాజెక్టు విజయానికి దోహదపడ్డారు. అలాగే, ప్రస్తుతం విశ్వ రహస్యాలను ఛేదిస్తున్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) ప్రాజెక్టులోనూ ఆమె భాగస్వామ్యం ఉంది. యూరోపియన్, కెనడియన్ అంతరిక్ష సంస్థలతో సమన్వయం చేస్తూ కీలక పరికరాల అభివృద్ధిలో పాలుపంచుకున్నారు.
ప్రస్తుతం ఆమె నాసా ప్రధాన కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. “ఆకాశం మనందరిది, ఓటమికి కుంగిపోకుండా ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవాలి” అని ఆమె యువతకు సందేశమిచ్చారు. ఒక భారతీయ మహిళ ప్రపంచ అంతరిక్ష రంగంలో ఇంతటి ఉన్నత స్థానానికి చేరడం గర్వకారణం.