క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత హత్య వెనుక భయంకర నిజాలు!

  • సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత హత్య యాదృచ్ఛికం కాదు
  • ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఆచూకీ కనిపెట్టిన మాజీ భర్త మహేశ్
  • కట్టర్ మెషిన్, పెప్పర్ స్ప్రేతో దాడి
  • హత్య కోసం రెండు నెలల పాటు రెక్కీ నిర్వహించిన వైనం
  • నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

వనస్థలిపురంలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఆవేశంలో జరిగిన హత్య కాదని, మాజీ భర్త మహేశ్ రెండు నెలల పాటు పక్కా ప్రణాళికతో అమలు చేసిన కిరాతక చర్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది. మాజీ భార్యపై పెంచుకున్న కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.

పోలీసుల విచారణ ప్రకారం కెనడాలో ఉద్యోగం కోల్పోవడం, సునీత పెట్టిన కేసుల వల్ల తిరిగి అక్కడికి వెళ్లలేకపోవడంతో మహేశ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. సునీత ఆచూకీ తెలుసుకోవడానికి ఆమె సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి పెట్టాడు. ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను నిశితంగా పరిశీలించి, వీడియోల బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన పరిసరాల ఆధారంగా వనస్థలిపురంలోని కాప్రాయి చెరువు సమీపంలో ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను గుర్తించాడు.

హత్యకు వెళ్లే ముందు మహేశ్ యుద్ధానికి సిద్ధమైనట్లుగా సామగ్రిని సమకూర్చుకోవడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె తలుపులు వేసుకుంటే కోసేందుకు గ్రైండర్ కట్టర్, ప్రతిఘటించకుండా కళ్లలో కొట్టేందుకు పెప్పర్ స్ప్రే, దాడి చేసేందుకు పదునైన కత్తులు వెంట తెచ్చుకున్నాడు. హత్య తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సుమారు 60 రోజులు తుర్కయాంజిల్‌లోని ఓ హాస్టల్‌లో ఉండి నాలుగు రోజులు సునీత కదలికలపై రెక్కీ నిర్వహించాడు. సరైన సమయం చూసి, వాచ్‌మన్ లేని వేళ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాను చేసిన నేరానికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఏ శిక్షకైనా సిద్ధమని మహేశ్ పోలీసుల ఎదుట చెప్పినట్లు సమాచారం.

సునీత రెండో భర్త శ్రీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  

Related posts

ఉగ్రవాదం దేశానికి పెను ప్రమాదం – ఈర్లపుడి సభలో కూనంనేని

Ram Narayana

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాధితురాలి ఆత్మహత్యాయత్నం!

Drukpadam

ఔటర్ రింగ్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

Ram Narayana