- రాందేవ్ ఇన్ఫోటెక్, శివమ్ టెక్నాలజీ దుకాణాల్లో మంటలు
- సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది, పోలీసులు
- ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తా మైత్రివనం వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నీలగిరి బ్లాక్‌లోని రాందేవ్ ఇన్ఫోటెక్, శివమ్ టెక్నాలజీ దుకాణాలలో మంటలు అలముకున్నాయి. ఈ భవనంలో కోచింగ్ సెంటర్‌లు ఉంటాయి. దీనితో ఆయా కోచింగ్ సెంటర్‌లలోని విద్యార్థులు కిందకు వచ్చేశారు. విద్యార్థులను పోలీసులు, హైడ్రా సిబ్బంది నిచ్చెనల ద్వారా కూడా సురక్షితంగా తీసుకువచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది హుటాహుటిన మైత్రివనంకు తరలి వచ్చారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదటి అంతస్తు వరకు మంటలు రావడం, పొగలు రెండో అంతస్తు వరకు వ్యాపించడంతో భవనాన్ని ఖాళీ చేయించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: