- ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ పై చర్చించాలంటూ వైసీపీ సభ్యుల ఆందోళన
- సభలోకి దేవుడి ఫొటోలు తీసుకురావడంపై దుమారం
- అసహనంతో హెడ్ ఫోన్స్ విసిరికొట్టిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా అంశం మరోసారి కుదిపేసింది. వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఈరోజు కూడా ఇందాపూర్ డెయిరీ, టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు తీర్మానం ఇవ్వగా, చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు.
మరోవైపు, సభలోకి వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫొటోలు తీసుకుని రావడం దుమారం రేపింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందిస్తూ… “దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా? దేవుడి ఫొటోలను పట్టుకుని సభలోకి రావడం అంటే దేవుడిని రాజకీయాల్లోకి లాగడమే. ఈ దుర్మార్గాన్ని అనుమతించవద్దు” అని అన్నారు.
వైసీపీ నేతలకు దేవుడంటే నమ్మకం, భయం లేవని పయ్యావుల మండిపడ్డారు. వాళ్ల నాయకుడు జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని అన్నారు. సభలోకి దేవుడి ఫొటోలను తీసుకురావడం హిందూ ధర్మాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. ఇలాంటి చర్యలకు అనుమతించవద్దని చైర్మన్ ను కోరారు. ఆయన ఓవైపు ఆగ్రహంతో మాట్లాడుతున్నా… వైసీపీ నేతలు దేవుడి ఫొటోలతో ఆందోళన చేయడంతో… అసహనంతో పయ్యావుల తన హెడ్ ఫోన్స్ తీసి విసిరికొట్టారు. ఈ ఆందోళనల మధ్య సభను చైర్మన్ వాయిదా వేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: