ఖమ్మం వార్తలు

రిటైర్మెంట్ డబ్బుల కోసం ఎదురుచూస్తూ మాజీ ఎస్సై మృతి…

ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతి పట్ల, పోలీసుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు.

ఖమ్మం జిల్లాకు చెందిన విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య రిటైర్మెంట్ బకాయిలు అందక, ఆసుపత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. జీవితకాలం ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన ఒక పోలీస్ అధికారి దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

గత ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయిన మైసయ్య గారికి సుమారు 60 లక్షల వరకు బకాయిలు రావాలి. ఏడాదవుతున్నా ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. భార్యాభర్తలిద్దరూ అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో కనీసం బిల్లులు కట్టుకోలేని దయనీయ స్థితికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెట్టింది. చివరకు బిల్లు కట్టలేక తోటి విశ్రాంత పోలీసు అధికారులు చందాలు వేసి మృతదేహాన్ని ఇంటికి పంపాల్సిన పరిస్థితి రావడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి, అమానవీయ కోణానికి అద్దం పడుతోంది. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే.

ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులను బకాయిలు ఇవ్వకుండా ఏడిపిస్తున్న ఈ ప్రభుత్వం.. మరోవైపు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కూడా కర్కశంగా వ్యవహరిస్తోంది. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్న పోలీస్ కుటుంబాలకు ఈ ప్రభుత్వం నరకం చూపిస్తోంది.

సెలవులు కూడా తీసుకోకుండా డ్యూటీలు చేసే పోలీసులకు ఆర్థికంగా అండగా నిలిచే సరెండర్ లీవ్స్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. వాళ్ల కష్టానికి, శ్రమకు దక్కాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడం అత్యంత శోచనీయం.

పోలీసులకు కొండంత అండగా ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్‌ను ఈ ప్రభుత్వం అటకెక్కించింది. ఆసుపత్రులకు వెళితే ఈ స్కీమ్ కింద వైద్యం అందక పోలీస్ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం పోలీస్ కుటుంబాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేది. నేడు వైద్యం అందక ఎంతోమంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం సిగ్గుచేటు.

కనీసం పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కోసం ఇచ్చే నెలవారీ అలవెన్సులకు కూడా నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. దిక్కులేక స్టేషన్ అధికారులు తమ సొంత జేబుల నుంచి, అప్పులు చేసి మరీ స్టేషన్లను నెట్టుకొస్తున్న దౌర్భాగ్య పరిస్థితిలో నేడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.

శాంతిభద్రతలు కాపాడే పోలీసులకు, తమ జీవితకాలం సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న బహుమతి ఇదేనా? ఎస్సై మైసయ్య మరణం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు రాక వైద్యం చేయించుకోలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

తక్షణమే మరణించిన ఎస్సై మైసయ్య కుటుంబానికి రావాల్సిన బకాయిలతో పాటు, ప్రత్యేక ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆయన భార్యకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలి.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అలాగే పోలీసులకు నిలిపివేసిన సరెండర్ లీవ్స్, ఆరోగ్య భద్రత, స్టేషన్ మెయింటెనెన్స్ నిధులను తక్షణమే పునరుద్ధరించాలి.

Related posts

డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో భారీగా కాంగ్రెస్ లో చేరికలు …

Ram Narayana

స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …మేము సైతం లో దూకుడు …

Drukpadam

20 స్థానాలు పెరిగితే రాజకీయ ముఖ చిత్రం మారేది…

Ram Narayana