జాతీయ వార్తలు

‘‘ఫ్రెండే కదా అని బ్యాంక్ డిటైల్స్ ఇచ్చాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కుపోయాడు!”

  • సైబర్ స్కాంలో ఇరుక్కున్న బెంగళూరు విద్యార్థి
  • తన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని ఫ్రెండ్ మాయమాటలు
  • నమ్మి తన ఖాతా వివరాలు ఇచ్చిన బాధితుడు
  • బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో బయటపడ్డ ‘స్నేహితుడి’ మోసం

‘ఆపదలో ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు’ అనుకున్నాడో అమాయకపు విద్యార్థి. ఆ నమ్మకమే అతడిని ఏకంగా రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్‌లో ప్రధాన నిందితుడిగా నిలబెట్టింది. బెంగళూరులోని ఒక ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి, తన స్నేహితుడి మాటలు నమ్మి ఇప్పుడు కటకటాల పాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు.

అసలేం జరిగిందంటే..
సదరు విద్యార్థికి ‘ఆయుష్’ అనే వ్యక్తితో ఏడాది కాలంగా పరిచయం ఉంది. గతేడాది నవంబర్‌లో ఆయుష్ తన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, అత్యవసరమైన లావాదేవీల కోసం అకౌంట్ కావాలని కోరాడు. స్నేహితుడే కదా అని నమ్మిన ఆ విద్యార్థి కర్ణాటక గ్రామీణ బ్యాంక్ లోని తన ఖాతా వివరాలన్నీ అతడికి అప్పగించాడు.

విద్యార్థి చేసిన పొరపాట్లుబ్యాంక్ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇచ్చేశాడు. ఏటీఎంకు లింక్ అయిన ఎయిర్‌టెల్ సిమ్ కార్డును కూడా కొరియర్ ద్వారా పంపాడు. కొన్ని నెలల తర్వాత సదరు విద్యార్థికి బ్యాంక్ నుంచి ఫోన్ రావడంతో అసలు విషయం బయటపడింది. అతడి అకౌంట్ ద్వారా ఏకంగా రూ.7 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బంతా సైబర్ నేరాల ద్వారా దోచుకున్నదని తెలియడంతో ఆ విద్యార్థి షాక్‌కు గురయ్యాడు. బాధితుడు వెంటనే బెంగళూరు నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయుష్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ముఖ్య గమనిక:
మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, లేదా బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన సిమ్ కార్డులను స్నేహితులకైనా, బంధువులకైనా ఇవ్వడం చట్టరీత్యా నేరం, ప్రమాదకరం. మీ అకౌంట్ ద్వారా జరిగే ప్రతి నేరానికి ప్రాథమికంగా మీరే బాధ్యులవుతారు.

Related posts

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్… ఏడుగురు మావోల మృతి!

Ram Narayana

బెయిల్ కోసం కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు: ఈడీ

Ram Narayana

అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు.. ఉద్యోగులు తెలుసుకోవాల్సిన కీలక మార్పులివే!

Ram Narayana