- ఝార్ఖండ్‌లో కుప్పకూలిన రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ విమానం
- రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా చత్రా జిల్లాలో ఘటన
- విమానంలో పైలట్లు, రోగి సహా ఏడుగురు ప్రయాణికులు
- ప్రమాదంలో ఏడుగురూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడి
ఝార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఏడుగురూ మరణించినట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 ఎయిర్ అంబులెన్స్ నిన్న రాత్రి 7:11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. తీవ్ర గాయాలపాలైన సంజయ్ కుమార్ అనే రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీకి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. టేకాఫ్ అయిన సుమారు 20 నిమిషాల తర్వాత, వాతావరణం అనుకూలంగా లేనందున మార్గాన్ని మళ్లించాలని పైలట్ కోరినట్లు, ఆ తర్వాత విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు, రోగి, ఒక డాక్టర్, పారామెడిక్, ఇద్దరు సహాయకులు సహా మొత్తం ఏడుగురూ మరణించినట్లు చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ జి వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలు చత్రా జిల్లాలోని సిమారియా అటవీ ప్రాంతంలోని ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధ్రువీకరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందాన్ని ఘటనాస్థలికి పంపింది. విచారణ పూర్తయితే ప్రమాదానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.
అప్పు చేసి మృత్యువును కొనుక్కున్నట్టయింది.. ఎయిర్ ఆంబులెన్స్ ప్రమాదంలో విషాదం

- భర్త ప్రాణం కాపాడుకోవడానికి 8 లక్షలు అప్పు చేసి ఎయిర్ ఆంబులెన్స్ బుక్ చేసిన భార్య
- విమానం కూలడంతో రోగి, అతడి భార్య, మరో బంధువు మృతి
- ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది కూడా దుర్మరణం
అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో భార్య ప్రయత్నించింది. స్నేహితులు, బంధువుల దగ్గర అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ అద్దెకు తీసుకుంటే.. అదే విమానం ఆ కుటుంబానికి మృత్యుపాశమైంది. ఝార్ఖండ్ లోని చత్రా జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో రోగి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
గుండెను పిండేసే నేపథ్యం..
ఝార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లా చాంద్వాకు చెందిన సంజయ్ (41) ఒక చిన్న హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత వారం తన హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు (65% కాలిన గాయాలు). స్థానిక ఆసుపత్రిలో చికిత్స ఫలించకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
చివరి ఆశగా ఎయిర్ అంబులెన్స్..
పేదరికంలో ఉన్నప్పటికీ సంజయ్‌ను బతికించుకోవాలనే ఆశతో ఆ కుటుంబం తెలిసిన వారి దగ్గర దాదాపు రూ.8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానంలో సంజయ్‌తో పాటు అతడి భార్య అర్చన, బంధువు ధ్రువ్ కుమార్ కూడా ఉన్నారు.
అర్ధాంతరంగా ముగిసిన ప్రయాణం..
రాంచీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాలకే వాతావరణం అనుకూలించక విమానం చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సంజయ్, అతడి భార్య అర్చన దేవి, బంధువు ధ్రువ్ కుమార్ తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక డాక్టర్ మరియు పారామెడికల్ సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. అప్పు చేసి మరీ ప్రాణాలు కాపాడుకోవాలనుకున్న ఆ ప్రయత్నం ఇలా విషాదాంతం అవ్వడం స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది.