జాతీయ రాజకీయ వార్తలు

ప్రధాని తన ఇమేజ్ కోసమే ఒత్తిడికి తలొగ్గారు: రాహుల్ గాంధీ

  • అమెరికా ఒత్తిడికి ప్రధాని మోదీ లొంగిపోయారన్న రాహుల్ గాంధీ
  • వాణిజ్య ఒప్పందంతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపణ
  • రైతులు, టెక్స్‌టైల్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన
  • భోపాల్ సభతో దేశవ్యాప్త కిసాన్ సమ్మేళన్‌లకు కాంగ్రెస్ శ్రీకారం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం కోసం ప్రధాని మోదీ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, అమెరికా ఒత్తిడికి పూర్తిగా లొంగిపోయారని ఆయన ఆరోపించారు. మంగళవారం భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మహా కిసాన్ సమ్మేళన్‌’లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి రూ.9 లక్షల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనివల్ల దేశీయ పరిశ్రమలు, ముఖ్యంగా వ్యవసాయ, టెక్స్‌టైల్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “టెక్స్‌టైల్ రంగాన్ని ఇప్పటికే నాశనం చేశారు. బంగ్లాదేశ్‌కు సున్నా శాతం సుంకాలు ఇచ్చిన అమెరికా, తమ నుంచి పత్తి కొనాలంటూ భారత్‌పై ఒత్తిడి తెస్తోంది” అని రాహుల్ విమర్శించారు.

“తన రాజకీయ భవిష్యత్తును, వ్యక్తిగత ఇమేజ్‌ను కాపాడుకోవడానికే నరేంద్ర మోదీజీ ఒత్తిడికి తలొగ్గారు” అని రాహుల్ ఆరోపించారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఈమెయిళ్లు, వీడియోలతో సహా కీలక ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఇంకా బయటపెట్టలేదని ఆయన తెలిపారు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తలపెట్టిన కిసాన్ సమ్మేళనాలకు ఈ సభతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. ఈ ఒప్పందం వల్ల పత్తి, సోయాబీన్, మొక్కజొన్న వంటి పంటలకు ప్రమాదం వాటిల్లుతుందని, రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో త్వరలో ఇలాంటి సభలు నిర్వహించనున్నారు.

Related posts

నేను ముస్లింలకు, ఇస్లాంకు వ్యతిరేకం కాదు: ప్రధాని నరేంద్ర మోదీ

Ram Narayana

బెంగాలీల పట్ల కేంద్రం వివక్ష …వర్షంలో మమతా నిరసన…

Ram Narayana

సీఎం యోగి ఇంటి కింద కూడా శివలింగం.. అక్కడా తవ్వకాలు చేపట్టాలి.. అఖిలేశ్ యాదవ్ డిమాండ్!

Ram Narayana