అంతర్జాతీయం

ఇరాన్ యుద్ధం సుప్రీం లీడర్ హత్యను ఖండించిన పుతిన్, ప్రియాంక..

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ‘సినికల్ మర్డర్’ (కిరాతక హత్య)గా అభివర్ణించిన పుతిన్.. ఇది అంతర్జాతీయ చట్టాలను, మానవత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు పుతిన్ ఓ లేఖ రాశారు. ఖమేనీని రష్యాలో అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా గుర్తుంచుకుంటామని, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని ఆ లేఖలో కొనియాడారు. శనివారం జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ సైనిక అధికారులు మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది.

ఈ ఘటనతో ఇరాన్ 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు, బాధ్యత అని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలు స్పందిస్తూ.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరగాలని సూచించారు. ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో, ముఖ్యంగా రష్యా-ఇరాన్ సంబంధాల్లో కీలక మార్పులకు కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఖమేనీ హత్య హేయమైన చర్య: ప్రియాంక గాంధీ
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించిన ప్రియాంక గాంధీ
ప్రజాస్వామ్య దేశాల తీరు హేయమంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం
మహాత్మా గాంధీ సూక్తులను గుర్తు చేస్తూ శాంతి ఆవశ్యకతపై ట్వీట్
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించాలని మోదీకి డిమాండ్

వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించడం, అనంతరం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆమె ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది యుద్ధం కాదని, శాంతి అని ఆమె స్పష్టం చేశారు.

“కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది” అన్న మహాత్మా గాంధీ మాటలను ప్రియాంక ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకునే వారు, ఒక సార్వభౌమ దేశాధినేతను ఇలా లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం, వేలాది మంది అమాయకుల ప్రాణాలు తీయడం అత్యంత హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు. దీనికి వారు ఏ కారణం చెప్పినా సమర్థనీయం కాదన్నారు. అనేక దేశాలు ఇప్పుడు ఈ ఘర్షణలోకి లాగబడటం విషాదకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆమె పరోక్ష విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు సాగిలపడిన మన ప్రధాని మోదీ, కనీసం ఇప్పుడైనా యుద్ధ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు.

మరోవైపు, ఖమేనీ హత్య తర్వాత పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో బహ్రెయిన్, కువైట్, దుబాయ్, దోహా, రియాద్ నగరాల్లో పేలుళ్లు వినిపించాయి. యూఏఈ తన గగనతలాన్ని మూసివేయడంతో, అనేక మంది భారతీయులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని భారత్ అడ్వైజరీలు జారీ చేసింది.

ఖమేనీ హత్య… హైదరాబాదులో నల్ల దుస్తులు ధరించి రోడ్డెక్కిన షియా ముస్లింలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై హైదరాబాద్‌లో నిరసనలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ భారీ ర్యాలీ
ఖమేనీ మృతికి సంతాపంగా ఇరాన్ కాన్సులేట్ వద్ద జెండా అవనతం
ముందస్తు జాగ్రత్తగా పాతబస్తీలో పోలీసుల భారీ బందోబస్తు
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంపై హైదరాబాద్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆదివారం పాతబస్తీలోని షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఖమేనీ మరణవార్త ధృవీకరణ కావడంతో పాతబస్తీలోని షియా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పురానీ హవేలీ, నూర్ ఖాన్ బజార్, దారుల్ఫా తదితర ప్రాంతాల్లో నల్ల దుస్తులు ధరించి, చేతిలో ఖమేనీ ఫొటోలు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు.

తంజీమ్-ఎ-జాఫరీ సంస్థ పిలుపు మేరకు పురానీ హవేలీలోని మజార్-ఎ-ఇబ్నే-ఖతూన్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు కంటతడి పెడుతూ నినాదాలు చేశారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకే ఖమేనీని పొట్టనబెట్టుకున్నారని, అగ్రరాజ్యాలకు తలొగ్గని నేతగా ఆయన నిలిచారని షియా మత పెద్దలు కొనియాడారు. ముస్లింల మధ్య ఐక్యత లేకపోవడమే ఈ విషాదానికి దారితీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఖమేనీ మృతికి సంతాప సూచకంగా హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆ దేశ జాతీయ జెండాను అవనతం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పాతబస్తీలో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, శనివారం ఉదయం టెహ్రాన్‌లో తన నివాసంలోని కార్యాలయంలో ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారని ఇరాన్ మీడియా వెల్లడించింది.

Related posts

ముగిసిన మయన్మార్ ‘స్కామ్ మాఫియా’ కథ.. 11 మంది మింగ్ ఫ్యామిలీ సభ్యులకు చైనాలో మరణశిక్ష అమలు!

Ram Narayana

ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే!… భారత్ స్థానం ఎక్కడంటే…!l

Ram Narayana

మధ్యప్రాచ్యం, యూరప్ దేశాలకు నేటి నుంచి ఎయిరిండియా విమానాల పునరుద్ధరణ

Ram Narayana