జాతీయ రాజకీయ వార్తలు

ఖమేనీని పొగిడి.. మోదీని ఇరుకునపెట్టిన శివసేన…

  • ఇరాన్ అధినేత ఖమేనీని నిజమైన నాయకుడిగా అభివర్ణించిన శివసేన (యూబీటీ)
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన అమరుడయ్యారని పేర్కొన్న సామ్నా పత్రిక
  • ట్రంప్, నెతన్యాహులకు ప్రధాని మోదీ లొంగిపోయారని తీవ్ర విమర్శ
  • ఇరాన్ విషయంలో భారత్ మౌనం వహించడంపై ప్రశ్నల వర్షం

శివసేన (యూబీటీ) వర్గం తమ అధికారిక పత్రిక ‘సామ్నా’లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని ఒక నిజమైన దేశభక్తుడిగా అభివర్ణిస్తూ, భారత నాయకత్వ వైఖరిని పరోక్షంగా తప్పుబట్టింది. నిజమైన నాయకుడు ఎన్నటికీ శత్రువులకు లొంగిపోడని, యుద్ధ సమయంలో ధైర్యంగా నిలబడతాడని ఖమేనీని ఉదాహరణగా చూపింది.

ఖమేనీ ఏ శక్తికీ తలవంచకుండా, ప్రాణాలను కాపాడుకోవడానికి దేశం విడిచి పారిపోలేదని లేదా బంకర్లలో దాక్కోలేదని సామ్నా సంపాదకీయం ప్రశంసించింది. ప్రపంచ శక్తులతో పోరాడుతూ ఇరాన్ కోసం ఆయన అమరుడయ్యారని పేర్కొంది. “దేశం కోసం ప్రాణత్యాగం చేస్తానని చెప్పిన ఒక బాలుడితో, ‘నాయనా, ముందు చదువుకో, శాస్త్రవేత్త అవ్వు. అవసరమైనప్పుడు దేశం కోసం మనమందరం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఖమేనీ చెప్పిన మాటలను ఆయన నిజం చేసి చూపారు” అని శివసేన గుర్తుచేసింది.

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నాయని, ఇది మానవత్వానికే ప్రమాదకరమని సామ్నా ఆరోపించింది. ప్రజాస్వామ్యం పేరుతో ఇతర దేశాల్లో జోక్యం చేసుకుని, అక్కడి చమురు, ఖనిజ సంపదను దోచుకోవడమే వాటి అసలు ఉద్దేశమని విమర్శించింది. లిబియాలో గడ్డాఫీ, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ మరణాలు కూడా ఇలాంటి జోక్యం వల్లే జరిగాయని పేర్కొంది.

ఈ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వ వైఖరిని శివసేన తీవ్రంగా తప్పుబట్టింది. ఒకప్పుడు కశ్మీర్ విషయంలో భారత్‌కు మద్దతిచ్చి, తక్కువ ధరకు చమురు అందించిన ఇరాన్ వంటి మిత్రదేశం విషయంలో మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుల ప్రభావానికి లొంగిపోవడం వల్లే భారత్ ఈ మౌనాన్ని పాటిస్తోందని ఆరోపించింది. ఇజ్రాయెల్ నుంచి పొందిన పెగాసస్ స్పైవేర్, ఎన్నికల ‘సైన్స్’ వంటి సాంకేతిక ‘మంత్రాల’ కారణంగానే అధికార పార్టీ నోరు మెదపడం లేదని సంచలన ఆరోపణలు చేసింది.

“ఒక ‘నిజమైన మిత్రుడి’ మరణం పట్ల ప్రధాని మోదీ కనీసం గంటసేపైనా సంతాపం ప్రకటిస్తారా? లేక ట్రంప్, నెతన్యాహులకు భయపడి మౌనంగానే ఉంటారా?” అని సామ్నా సంపాదకీయం సూటిగా ప్రశ్నించింది.

Related posts

రాజస్థాన్‌లోనూ పోటీ చేస్తాం: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ

Ram Narayana

 విపక్ష కూటమికి BHARAT పేరు పెట్టాలన్న శశి థరూర్.. దీని అర్థం కూడా చెప్పిన వైనం

Ram Narayana

బెంగాల్‌లోనూ విజయం మాదే.. బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ ధీమా

Ram Narayana