తెలంగాణ వార్తలు

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

  • తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన శుక్లా
  • ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ 
  • కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు
  • ఈ నెల‌ 16 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ శుక్లాకు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ నెల‌ 16వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అదే రోజున ఉభయ సభలను ఉద్దేశించి కొత్త గవర్నర్ ప్రసంగించనున్నారు.

గతవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శుక్లాను తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు గవర్నర్‌గా నియమించారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన శివ్ ప్రతాప్ శుక్లా, విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. అనంతరం 2016లో రాజ్యసభకు ఎన్నికై, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా సేవలు అందించారు. 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

Related posts

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్అరెస్ట్

Ram Narayana

తన పేరిట వసూళ్లు… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!

Ram Narayana

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు… మంత్రి పొంగులేటి

Ram Narayana