- ఏజెన్సీల దగ్గర ‘నో స్టాక్’.. బ్లాక్‌లో ఇస్తే రూ.4,000 వరకు వసూలు
- మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా సిలిండర్ల తరలింపు
- గ్యాస్ భారం మోయలేక ‘బావర్చి’ సహా పలు హోటళ్లు మూత
- యాదగిరిగుట్టలో 4 రోజులకు సరిపడ నిల్వలే.. ఆలయాల్లో ఆందోళన.
- కట్టెల ధరలు కూడా కిలో రూ.20కి పెంపు
గ్యాస్ కొరతను సాకుగా చూపి ఏజెన్సీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. అధికారికంగా బుక్ చేసుకున్న వారికి ‘స్టాక్ లేదు’ అని చెబుతూనే, రూ.3,500 నుంచి రూ.4,000 వరకు ముట్టజెప్పే వారికి గుట్టుచప్పుడు కాకుండా సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి కూడా సిలిండర్లను అక్రమంగా తరలించి మాదాపూర్ వంటి ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రముఖ హోటళ్లపై ప్రభావం
వాణిజ్య సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో చిన్న హోటళ్లు మూతపడుతుండగా, ఐకానిక్ హోటల్స్ కూడా చేతులెత్తేస్తున్నాయి. హైదరాబాద్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బావర్చి హోటల్ బుధవారం మూతపడటం నగరంలో గ్యాస్ సంక్షోభానికి నిదర్శనంగా నిలిచింది. ఐటీసీ వంటి దిగ్గజ హోటల్ గ్రూపులు సైతం తమ ఆహార సేవలలో అంతరాయం కలగవచ్చని కస్టమర్లకు ముందే సమాచారం ఇస్తున్నాయి.
ఆలయాల్లో ‘నిత్యాన్నదానానికి’ గండం
ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, అన్నదాన కార్యక్రమాలు ప్రశ్నార్థకంగా మారాయి.
యాదగిరిగుట్ట: రోజుకు 5 వేల కిలోల గ్యాస్ అవసరమయ్యే ఈ ఆలయంలో కేవలం 4 రోజుల నిల్వలు మాత్రమే ఉన్నాయి.
సికింద్రాబాద్: ఉజ్జయినీ మహంకాళి, గణేశ్ ఆలయాల్లో 2-3 రోజులకు మించి గ్యాస్ లేదు.
ఈ విపత్కర పరిస్థితులపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు చమురు సంస్థలతో అత్యవసర సమీక్ష నిర్వహించి, సరఫరాలో ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
కట్టెలకూ పెరిగిన డిమాండ్
గ్యాస్ సిలిండర్ కొనలేక, ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు మరియు విద్యార్థులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని కూడా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిన్నటి దాకా కిలో రూ.10 ఉన్న కట్టెల ధరను డిమాండ్ పెరగడంతో రూ.20 వరకు పెంచి సామాన్యుడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ల కొరత భయం.. హాట్ కేకుల్లా ఇండక్షన్ స్టవ్‌లు.. ఆన్‌లైన్‌లో ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు!

- ఎల్‌పీజీ కొరత వస్తుందన్న భయాలతో ఇండక్షన్ స్టవ్‌లకు పెరిగిన డిమాండ్
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో పలు మోడళ్లు ‘అవుట్ ఆఫ్ స్టాక్’
- మూడు రెట్లు గిరాకీ పెరిగిందని తెలిపిన క్రోమా
- ఎల్‌పీజీ కొరత లేదని, ఆందోళన వద్దని కేంద్ర ప్రభుత్వం భరోసా
- సరఫరా సజావుగానే ఉందని పెట్రోలియం శాఖ వెల్లడి
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల లభ్యతపై ఆందోళనలు పెరగడంతో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యామ్నాయ వంట మార్గంగా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోలుకు ఎగబడుతుండటంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అవి ‘అవుట్ ఆఫ్ స్టాక్’గా మారుతున్నాయి.
ఎన్డీటీవీ కథనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ సైట్లలో ఇండక్షన్ కుక్‌టాప్‌ల లభ్యత గణనీయంగా పడిపోయింది. బ్లింకిట్‌లో దాదాపు అన్ని మోడళ్లు స్టాక్ లేవని చూపిస్తుండగా, అమెజాన్‌లో కెంట్, ఉషా వంటి కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మోడళ్లు ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రిటైలర్లు చెబుతున్నారు. పీటీఐ వార్తా సంస్థ ప్రకారం టాటా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ రిటైలర్ ‘క్రోమా’లో ఇండక్షన్ కుక్‌టాప్‌ల గిరాకీ మూడు రెట్లు పెరిగింది. ఈ విషయాన్ని ఇన్ఫినిటీ రిటైల్ లిమిటెడ్ సీఈవో శిబాషిష్ రాయ్ ధ్రువీకరించారు. అలాగే పిజియన్, గిల్మా వంటి బ్రాండ్లతో కిచెన్ ఉపకరణాలను విక్రయించే స్టవ్‌క్రాఫ్ట్ లిమిటెడ్ ఆన్‌లైన్ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గాంధీ తెలిపారు.
దేశంలోని కొన్ని నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం ప్రజలు బారులు తీరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య ఎల్‌పీజీ బుకింగ్‌లను పరిమితం చేసి, గృహ అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.
ఎల్‌పీజీ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం
అయితే, దేశంలో గృహావసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏమాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది. బుక్ చేసిన 2.5 రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ తెలిపారు. దేశానికి 70 శాతం ముడి చమురు సరఫరా హోర్ముజ్ జలసంధి బయటి మార్గాల నుంచే జరుగుతోందని, సరఫరాకు ఎలాంటి ముప్పు లేదని వివరించారు. ప్రభుత్వ చర్యల వల్ల ఎల్‌పీజీ ఉత్పత్తి 25 శాతం పెరిగిందని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ, వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనతో ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి.