ఖమ్మం వార్తలు

ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన మంత్రులు తుమ్మల పొంగులేటి

ఫలానా నాయకుని హయంలో మా ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని ప్రజల మన్ననలు పొందేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  గురువారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో
నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్ లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, రాష్ట్ర కేబినెట్ ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని, ప్రజల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారు లకు అవి చేరేలా చూడాలని తెలిపారు.

డబ్బు సంపాదించడం కోసం ప్రజా ప్రతినిధులు ఎవరు రాజకీయంలోకి రాలేదని అన్నారు. సర్పంచ్ నుంచి కలెక్టర్ వరకు ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు మనకు అందించారని, మనం అధికారంలో ఉన్న సమయంలో గ్రామంలో మంచి అభివృద్ధి జరిగింది, మంచి పనులు జరిగాయనే మంచి పేరు సంపాదించాలని తాపత్రయ పడతామని మంత్రి అన్నారు.

ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మనపై నేడు ఉందని అన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సమయం కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మంచి మార్పు కనిపిస్తుందని అన్నారు. పాలక వర్గాలు లేక గ్రామాలకు నిధులు రాలేదని, గత నెలన్నర కాలంలో పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయని, మార్చి 31 లోపు మరిన్ని నిధులు విడుదల అవుతాయని మంత్రి తెలిపారు.

ప్రతి గ్రామానికి జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు నిధులు విడుదల అయ్యాయని, ఈ నిధులు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని అన్నారు. చట్ట పరిధిలో నిధులను సద్వినియోగం చేయాలని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కాపలాదారుగా ఉండాలని తెలిపారు.

పేద ప్రజలకు నిరంతరం మంచి చేసే విధంగా, రాజకీయాలకతీతంగా ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ప్రస్తుతం గెలిచిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. ప్రతి ప్రాంత అభివృద్ధికి పార్టీలకతీతంగా తన సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.

రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్య ఏ గ్రామంలో లేకుండా ఉండే విధంగా అధికారులు, నూతన ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. గ్రామ పంచాయతీకి విడుదలైన నిధులు సద్వినియోగం అయ్యే విధంగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు తెలిపారు.

గ్రామాలలో సమస్యలు కేవలం డబ్బుతో మాత్రమే పరిష్కారం కావని అన్నారు. సిసి రోడ్ల, డ్రైయిన్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టడం చాలా కీలకమని అన్నారు. గ్రామాలలో నిర్మించే నూతన రోడ్లు, డ్రైయిన్ సమయంలో అధికారులు ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ అధికంగా ఉండాలని, ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు.

ప్రజలతో నిరంతరం ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటూ సమయస్ఫూర్తితో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. నేటి శిక్షణ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు సరిగ్గా వినియోగించు కోవాలని సూచించారు.

ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో
నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్ లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ మహిళలు స్థానిక సంస్థల ఫలితాలలో ఎక్కువ శాతం విజయం సాధించారని తెలిపారు. పీఎం, సీఎం లకు ఉన్న అధికారాలు గ్రామాలు, పట్టణాలలో స్థానిక సంస్థలకు ఉంటుందని తెలిపారు. ప్రతి శాఖకు సంబంధించి రివ్యూ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో పని చేసిన నాయకులు గొప్ప స్థాయికి ఎదుగుతారని అన్నారు.

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు అందించిన శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజల సొమ్ము న్యాయబద్దంగా ఖర్చు చేయాలని, ఊరిలో ఉన్న చెరువు కాపాడుకుంటూ చేపలు పెంచడం ద్వారా లక్షల రూపాయల వరకు మత్స్య సంపద సృష్టించవచ్చని అన్నారు.

రోడ్ల వెంబడి కొబ్బరి చెట్లు పెంచి వాటి ద్వారా ఆదాయం సంపాదించే గ్రామ పంచాయతీలు కూడా మన దేశంలో ఉన్నాయని, సొంత ఆదాయ మార్గాలు
గ్రామ పంచాయతీలు పెంచుకోవాలని సూచించారు. ఉచితాల వల్ల ప్రయోజనం రాదని, ప్రజలను భాగస్వామ్యం చేస్తే సత్ఫలితాలు ఉంటున్నాయని అన్నారు.

ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని , ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయం తో అటువంటి పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గ్రామాలలో మొక్కలు నాటేందుకు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎన్ని బ్రతుకుతున్నాయి వంటి అంశాలకు పక్కా లెక్కలు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

గ్రామంలో కరెంటు స్తంభాల వద్ద మొక్కలు నాటవద్దని అన్నారు. సర్పంచ్ బాధ్యతగా పని చేస్తే గ్రామాలు బాగుపడతాయని అన్నారు. గ్రామంలో ఉన్న మంచి తారు రోడ్డు మీద కేజీ వీల్స్ వాడితే సర్పంచ్ చర్యలు తీసుకోవాలని, మంచి రోడ్లను పాడు చేసుకొని మరమ్మత్తు నిధుల కోసం నాయకులకు ప్రతిపాదనలు పంపితే ఫలితం ఉండదని అన్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రజలకు మౌళిక వసతుల కల్పన కోసం పదవిలో ఉన్నా లేకపోయినా తాను కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని, డబ్బులు మాత్రమే ప్రధానం కాదని, మన మాట తీరు, ప్రజల భాగస్వామ్యం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు.

కోతుల సమస్య గ్రామంలో తీవ్రంగా ఉందని, వాటిని తరలించే పరిస్థితి మనకు వచ్చిందని, దీనికి కారణం మానవ తప్పిదమని, అడవులు కొట్టవద్దని, రోడ్లు విస్తరించాలని చెబితే తనను రెండుసార్లు ఓడించారని, అయినా సరే అడవుల సంరక్షణ, రోడ్ల విస్తరణకు తాను కట్టుబడి ఉంటానని, దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని అన్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవంలో తనతో పని చేసిన ఉద్యోగులు, కలెక్టర్ లకు మంచి పేరు వచ్చిందని అన్నారు. ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు, భద్రాచలం ఆలయానికి రైల్వే లైన్ తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే జూన్ నాటికి జిల్లాలో 5 నియోజకవర్గాలకు గోదావరి జలాలకు తరలిస్తామని తెలిపారు.

కాల్వ పనులకు రైతులు అడ్డుపడితే స్థానిక ప్రజాప్రతినిధులు సముదాయించి పనులు జరిగేలా చూడాలని, గాలిలో ప్రాజెక్టులు కట్ట లేమని , భూమి మీదే కట్టాల్సి ఉంటుందని, రైతులకు మెరుగైన పరిహారం అందిస్తామని అన్నారు. గ్రామాలలో ఉన్న వైద్యశాలలు, పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటూ అక్కడ పనిచేసే సిబ్బంది సమయానికి వచ్చేలా చూడాలని అన్నారు.

పంచాయతీ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. నూతన తహసిల్దార్ కార్యాలయాలు, పంచాయతీ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దశల వారీగా నిధులు వస్తాయని తెలిపారు. గ్రామాలలో ఉన్న ప్రకృతివనం, డంపింగ్ యార్డ్ , స్మశాన వాటిక ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేపట్టి వినియోగంలోకి తీసుకుని రావాలని అన్నారు. ‌

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం కీలకమని తెలిపారు. 99 రోజుల కార్యక్రమం పై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేడు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజా ప్రతినిధులకు గుర్తింపు కార్డులు, 99 రోజుల కార్యక్రమంపై మెటీరియల్ అందించామని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు 10 థీమ్స్ లో చేపట్టే ప్రోగ్రాంలలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన వివిధ సంక్షేమ, అభివృద్ధి పనుల అమలు గురించి అవగాహన, పంచాయతీ, మున్సిపల్ చట్టాల గురించి కూడా శిక్షణ అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

నేటి శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇంటారాక్టివ్ సెషన్ లాగా నేటి శిక్షణ కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పట్టణ ప్రాంత ప్రజా ప్రతినిధులకు విధి నిర్వహణ, ప్రభుత్వ ముఖ్యమైన కార్యక్రమాలు ప్రజలకు అందించేందుకు ఉన్న నిబంధనలు విధివిధానాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తమ గ్రామం, మున్సిపల్ వార్డు/డివిజన్ పరిధిలో నిబంధనల ప్రకారం బాగా పనిచేసి జాతీయస్థాయిలో ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, పంచాయతీ రాజ్ డిప్యూటీ కమీషనర్, జిల్లా ప్రత్యేక అధికారిణి విద్యాలత, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిపిఓ రాంబాబు, డిఆర్డిఓ కె. శ్రీరామ్, సిపిఓ ఏ. శ్రీనివాస్, డివైఎస్ఓ సునీల్ రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రామారావు, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. విజయలక్ష్మీ, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు, సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వార్డు కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మైరా మురిపెంలో.. పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులు

Ram Narayana

శ్రీకాంత్ మరణం ప్రజాఉద్యమాలకు తీరనిలోటు …వివిధ పార్టీల నేతల నివాళులు

Ram Narayana

తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి …ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల…

Ram Narayana