ఏపీ హైకోర్టు వార్తలు

ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌‌కు తాత్కాలిక ఊరట…

మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్‌కు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆయన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నందున, ఆమె బాగోగులు చూసుకునేందుకు వీలుగా ఈ నెల 22వ తేదీ వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకాకుండా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సునీల్ నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు సునీల్ నాయక్ బుధవారం వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారని తెలిపారు. అయితే, పాట్నాలో ఉన్న తల్లికి అనారోగ్యం తీవ్రమవడంతో ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. సునీల్ నాయక్‌కు ఈ నెల 22 వరకు విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి మార్చి 23న ఉదయం 10 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇక, ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణార్హతపై ఈ నెల 18న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

Related posts

ఏపీ సీఎస్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరిక…

Ram Narayana

పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు

Ram Narayana

ఏఐ టెక్నాలజీతో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయాధికారి.. ఏపీ హైకోర్టు కీలక హెచ్చరికలు…

Ram Narayana