మావోయిస్టు పార్టీకి నేను కార్యదర్శిని కాదు ..కార్యదర్శి ఎన్నిక జరగలేదు …తిపరి తిరుపతి
మేము లొంగిపోలేదు …పోలీసులు అరెస్టు చేశారు
నంబాల మృతి కొందరి కుట్ర వల్లనే జరిగింది..అది పార్టీకి భారీ నష్టం
హిద్మా పోలీస్ కొరియర్ ద్రోహానికి బలైయ్యారు ..
మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి
జైల్లో ఉన్న మావోయిస్టులను, సానుభూతి పరులను విడుదల చేయాలి
మల్లోజుల , ఆశన్నలు పార్టీకి ద్రోహం చేశారు …
వాళ్ళ వల్లనే లొంగుబాట్లు పెరిగి పార్టీ బలహీనపడింది ..
బలమైన లీగల్ పోరాటాల ద్వారానే పార్టీని బలోపేతం చేయాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు , రైతు చట్టాలపై జరిగిన పోరాటాలు స్ఫూర్తి
మావోయిస్టు పార్టీలో నంబాల కేశవరావు మరణం తర్వాత కేంద్ర పార్టీ కార్యదర్శి ఎన్నిక జరగలేదని నేను పార్టీ కేంద్ర కార్యదర్శినని జరుగుతున్న ప్రచారం లో వాస్తవం లేదని, నేను కార్యదర్శిని కాదని కేవలం పొలిట్ బ్యూరో సభ్యుడనేనని తిపరి తిరుపతి అలియాస్ దేవీజీ అన్నారు. ఇటీవల ఆయన వివిధ మాధ్యమాల ద్వారా ఇస్తున్న ఇంటర్వ్యూ లలో పార్టీ ఆలోచన విధానం తమ అరెస్టులు, లొంగుబాట్లు పై ఉన్న కన్ఫ్యూజన్ గురించి వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ..నంబాల కేశవరావు మరణం కొందరు ద్రోహులు చేసిన కుట్ర వల్లనే జరిగిందన్నారు ..ఆయన మరణం పార్టీకి భారీ నష్టం చేసిందని అంగీకరించారు .. హిద్మ కొరియర్ వ్యవస్థను నమ్మి అరెస్ట్ అయి రెండు రోజుల చిత్రహింసలకు గురైయ్యారని అనంతరం కాల్చి చంపారని తెలిపారు ..తాను అనేక సార్లు హెచ్చరించానని ప్రతిసారి నన్నే కన్విన్స్ చేశాడని చివరకు శత్రువుల వలలో చిక్కుకున్నారని అన్నారు ..మావోయిస్ట్ పార్టీ , ఎల్పీజీ వేరు వేరని, పాలకులు రెండు ఒకటే అని అనుకుంటున్నారని దేవీజీ అన్నారు ..హిద్మ ఎల్పీజీలో కమాండర్ స్థాయికి ఎదిగారని చురుకైన వాడని అన్నారు ..ప్రజలకోసం పనిచేస్తున్నందునే ఆయనకు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు ..
ఎక్కడెక్కడో ఉన్న పార్టీ కేంద్ర నాయకత్వాన్నిసంప్రదించి కేంద్ర కార్యదర్శిని ఎన్నుకోవాలని ఆలోచనలు చేస్తున్న తరుణంలోనే మల్లుజుల ఆశన్నలు పార్టీకి ద్రోహం చేశారని ఒకరకంగా శత్రువులతో చేతులు కలిపి ఆయుధాలతో సహా లొంగిపోయారని అన్నారు ..వారిని ద్రోహులుగా పార్టీ ప్రకటించడం జరిగిందన్నారు .వాళ్ళు లొంగిపోయిన పార్టీలో లొంగుబాట్లు పెరిగాయని అంగీకరించారు …ఆపరేషన్ కగారు సందర్భంగా తాము చాలాకాలం కర్రెగుట్టల్లో ఉన్నామని తెలిపారు .శత్రువుల నిర్బంధం ఎక్కువైనా తర్వాత అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు . తిరిగి పరిస్థితులు కుదట పడిన తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు .. తాను మూడు నెలల పాటు ములుగు ప్రాంతంలో ఉన్నానని అక్కడ నుంచి వేరే రాష్ట్రం వెళ్లేందుకు హైద్రాబాద్ చేరుకోగా పోలీసులు అరెస్టు చేశారని అన్నారు .. పోలీసులు చెపుతున్నట్లుగా తాము లొంగిపోలేదని అరెస్ట్ అయ్యామని స్పష్టం చేశారు ..
అరెస్ట్ అయినా సందర్భంగా సీఎం దగ్గరకు తీసుకోని వెళ్లారని అప్పుడు అక్కడ పార్టీపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని జైల్లో ఉన్న మావోయిస్టులను సానుభూతిపరులను విడుదల చేయాలనీ డిమాండ్ చేశామని అన్నారు…సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని అయితే ఇది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం అయినందున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో మాట్లాడతానన్నారని ఆ దిశగా ఆయన వైపు నుంచి లోపం లేకుండా ప్రయత్నం చేశారని ఫలితం ఏమిటన్నది ఇంకా సమాచారం లేదని అన్నారు ..
పార్టీపై నిషేధం ఎత్తివేసి లీగల్ గా పనిచేసుకునేందుకు అవకాశం ఇస్తే ప్రజల దైనందిన దీర్ఘకాలిక సమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు .. ఇంకా సాయుధులుగా ఉన్నవారిని సైతం లొంగిపోయి ఆయుధాలు అప్పగించేలా కృషి చేస్తామని అన్నారు … తాము కాంగ్రెస్ లో చేరుతున్నామని లేదా ఇతర పార్టీల్లో చేరబోతున్నారని వస్తున్న వార్తలు కేవలం కల్పితాలని అన్నారు .. తాము అధికార పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీచేయబోతున్నామని జరుగుతున్న ప్రచారం కేవలం మీడియా కల్పితాలేనని కొట్టి పారేశారు …తాము కోట్లాది మంది ప్రజలకోసం ప్రాణాలు సైతం లెక్కచేయక నిలబడ్డామని పేదల కోసం జనతన సర్కార్ నడిపామని , అయితే అప్పడు సాయుధులుగా ఉన్నామని, ఇప్పుడు అవకాశం ఇస్తే చట్ట పరిధిలో ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు .. బలమైన ఉద్యమాల ద్వారానే పార్టీని అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, కిసాన్ ఉద్యమాలు తరహాలో ప్రజల కోసం పనిచేస్తామని అందుకోసం అవసరమైతే జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధమేనని తిరుపతి అన్నారు ..ఉద్యమాల్లో అమరులైన మావోయిస్టు కుటుంబాలను కలవాలని నిర్ణయించుకున్నామని వారికీ అండగా మేము ఉన్నామనే భరోసా , వారికీ అవసరమైన ఆర్థిక సహాయం కూడా దాతలను నుంచి సేకరించి ఇస్తామని తెలిపారు .. మల్లోజుల ఆశన్నలను కూడా మీ పోరాటాల్లో కలుపుకుంటారా ..?అనే ప్రశ్నకు వారు బహిరంగంగా తమతప్పును అంగీకరిస్తే ఆలోచిస్తామని తిరుపతి అన్నారు ..