ఏపీలో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు కల్పించే 25శాతం ప్రయాణ రాయితీని పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అర్హులైన వృద్ధులకు ‘మన మిత్ర’ వాట్సాప్ సేవల ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్, దివ్యాంగుల రాష్ట్ర సలహా బోర్డు సమావేశాల్లో మంత్రి డోలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వృద్ధులకు నెలకు రూ. 4 వేల చొప్పున పింఛన్ అందిస్తున్నామని గుర్తుచేశారు. ఇటీవల పెరిగిన సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దివ్యాంగుల సంక్షేమంపై కూడా మంత్రి పలు కీలక హామీలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ‘దివ్యాంగ శక్తి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే దివ్యాంగుల కోసం ప్రత్యేక రుణ రాయితీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాజధాని అమరావతితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దివ్యాంగ భవన్‌ల నిర్మాణం చేపడతామని, టిడ్కో ఇళ్లలో దివ్యాంగులైన లబ్ధిదారులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఫ్లాట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలు సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు అర్హులు. గతంలో రుసుము వసూలు చేయగా, ఇప్పుడు ఈ కార్డులను గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాలతో పాటు కొత్తగా ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో వంటి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రాయితీ, రైళ్లలో లోయర్ బెర్త్‌ల కేటాయింపు, బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల కోసం కార్డుపై బ్లడ్ గ్రూప్, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ వంటి వివరాలు కూడా పొందుపరుస్తారు.