రక్తం మరుగుతోంది ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్!
-టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిక
-కేసీఆర్ కు ఎస్సీలు, ఎస్టీలు గుర్తొచ్చేది ఉప ఎన్నికల సమయంలోనే
-దళిత సీఎం ఎక్కడ ? దళిత డిప్యూటీ సీఎం ను ఎందుకు తొలగించావ్
-దళితులను ఓర్చుకోలేని కేసీఆర్ అంటూ రేవంత్ ధ్వజం
తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి వేదికగా భారీ బహిరంగ సభ చేపట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారు తీరు పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పాలన లో ఎస్సీ, ఎస్టీల జీవితాలు చితికిపోతున్నాయని, ఆదివాసీల జీవితాలను మార్చాలన్నది కాంగ్రెస్ ప్రణాళిక అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరాలో వ్యాఖ్యానించారు. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోంది అని బానిస సంకెళ్లు తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోంది అంటూ రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేల్చారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన దండోరాకు ఉప్పెనలా కార్యకర్తలు, గిరిజనులు, ఆదివాసీలు తరలివచ్చారు అని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం గడ్డమీద చెప్తున్నా ..టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దళిత సోదరులకు అండగా ఉంటామని స్పష్టం చేసిన ఆయన దళితుడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని తేల్చి చెప్పారు. లోక్ సభ స్పీకర్ గా మీరా కుమార్ ను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని, రిజర్వేషన్లను ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని , కాంగ్రెస్ చేసిన త్యాగమే ఈ రోజు స్వరాష్ట్రం అని రేవంత్ పేర్కొన్నారు.
ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ఎస్సీలు గుర్తుకొస్తారు అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదు అని విమర్శించిన ఆయన, నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ కు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దళిత డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేసిన కేసీఆర్ తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. ఇక డిప్యూటీ సీఎంగా ఎస్సీ కి అవకాశం ఇచ్చి చాలా అవమానకర రీతిలో తొలగించారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఆ దళిత బిడ్డ చేసిన నేరమేంటో ఇప్పటివరకు వెల్లడించలేదని కెసిఆర్ ను నిలదీశారు. మొదటి ఐదేళ్లు మహిళలకు మంత్రివర్గంలో స్థానం లేదని విమర్శించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చామని ఇంద్రవెల్లి వేదికకు అధ్యక్షత వహించింది ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటూ చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని, ఆయన వారిని ఒర్చుకోలేరని మండిపడ్డారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు తోడుగా నీడగా ఉంటానని భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి, సమైక్య పాలనలో అడవిబిడ్డలను కాల్చేస్తుంటే ఈ ప్రాంత నేతలు ఏం చేశారంటూ ప్రశ్నించారు. నిస్సహాయంగా చూస్తూ ఉన్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ కోసం అమరులైన ఆదివాసి బిడ్డల పేర్లను స్మారక శిలాఫలకాలపై వ్రాయించి వారిని గుర్తుండేలా చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దళిత, గిరిజన సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.