అంతర్జాతీయం

యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి.. యూఏఈకి తీవ్ర హెచ్చరిక…

ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ యూఏఈ యుద్ధంలో పాలుపంచుకుంటే, పర్యాటక స్వర్గధామాలైన దుబాయ్, అబుదాబి నగరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నగరాలు కేవలం విలాసవంతమైన పర్యాటక కేంద్రాలే తప్ప, పటిష్ఠమైన సైనిక రక్షణ వ్యవస్థలు కలిగిన ప్రాంతాలు కావని గుర్తుచేశారు.

యూఏఈ అనవసరంగా ఓ చిక్కుముడిలో పడిందని సాక్స్ విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో జతకట్టడం ద్వారా ఆ దేశం తన తప్పులను మరింత పెంచుకుంటోందని అన్నారు. “యూఏఈ యుద్ధంలోకి ప్రవేశిస్తే దుబాయ్, అబుదాబి నగరాలను పేల్చివేయవచ్చు. ఇవి పెట్టుబడులకు, విలాసాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఇలాంటి ప్రదేశం యుద్ధ క్షేత్రంగా మారితే దుబాయ్ ఉనికికే అర్థం ఉండదు” అని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా అండతో కుదిరిన ఒప్పందాలను సాక్స్ “విపత్తుకు ఆహ్వానం”గా అభివర్ణించారు. అమెరికాకు శత్రువుగా ఉండటం కంటే మిత్రుడిగా ఉండడమే ఎక్కువ ప్రాణాంతకమన్న మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ మాటలను ఆయన గుర్తుచేశారు. “గల్ఫ్ దేశాలు తమ భద్రత కోసం పూర్తిగా అమెరికాపై ఆధారపడుతున్నాయి. తమ దేశంలోని అమెరికా సైనిక స్థావరాలు తమను రక్షిస్తాయని భావిస్తున్నాయి. కానీ ఇది చాలా పెద్ద తప్పుడు అంచనా” అని ఆయన విశ్లేషించారు.

యూఏఈ తన సొంత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఓడిపోయే పక్షం వైపు నిలబడకూడదని సాక్స్ సూచించారు. తమపై దాడులకు తమ భూభాగంలోని అమెరికా స్థావరాలను వాడుకోనీయవద్దని ఇరాన్ ఇటీవలే పశ్చిమాసియా దేశాలను హెచ్చరించిన నేపథ్యంలో సాక్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, తమ ఇంధన వనరులపై ఇరాన్ దాడులను గల్ఫ్ దేశాలు ఖండిస్తూ అమెరికాకు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.

Related posts

కెనడాలో భార‌తీయ విద్యార్థిని మృతి

Ram Narayana

దీపావళికి సెలవు ప్రకటించిన ఏకైక అమెరికన్ రాష్ట్రం

Ram Narayana

భారత్-చైనా సరిహద్దుల్లో 108 కిలోల బంగారం స్వాధీనం…

Ram Narayana