మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి పక్కన నిద్రిస్తున్న రెండు నెలల పసికందును ఓ చిరుతపులి ఎత్తుకెళ్లి చంపేసింది. మమల్డే గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘోరంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మమల్డే గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ రెండు నెలల శిశువుతో కలిసి రాత్రి ఇంటి ఆరుబయట నిద్రించింది. తెల్లవారుజామున నిద్రలేచిన తల్లిదండ్రులు, పక్కన పాప కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఇంటికి కొంత దూరంలో ఉన్న పొలాల్లో చిన్నారి మృతదేహ అవశేషాలు కనిపించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది చిరుతపులి దాడేనని ప్రాథమికంగా నిర్ధారించారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కువైందని, పలుమార్లు పశువులపై కూడా దాడి చేశాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పసికందు మృతితో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు, చిరుతను వెంటనే బంధించి తమకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.