పార్లమంట్ న్యూస్ ...

ఆ సమయంలో భార్యకు భర్త అండ లగ్జరీ కాదు… అవసరం: ఎంపీ రాఘవ్ చద్దా

పితృత్వ సెలవును (Paternity Leave) దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో చట్టబద్ధమైన హక్కుగా మార్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ‌ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. బిడ్డ సంరక్షణ బాధ్యత కేవలం తల్లులకే పరిమితం కాదని, అది తల్లిదండ్రులిద్దరి ఉమ్మడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. “బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులిద్దరికీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి, కానీ సంరక్షణ బాధ్యత మాత్రం చట్టపరంగా తల్లిపైనే పడుతోంది. ఇది చట్టం బలవంతంగా రుద్దుతున్న సామాజిక వైఫల్యం” అని వ్యాఖ్యానించారు. ప్రసవానంతరం ఒక మహిళకు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా భర్త అండ ఎంతో అవసరమని ఆయన అన్నారు. “ఆ సమయంలో భర్త తోడు విలాసం (లగ్జరీ) కాదు, అత్యవసరం. భార్య పట్ల భర్తకు ఉండే సంరక్షణ బాధ్యత కూడా అంతే ముఖ్యం” అని సభకు వివరించారు.

ప్రస్తుతం దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే 15 రోజుల పితృత్వ సెలవు లభిస్తోందని, ప్రైవేట్ రంగంలో అలాంటి నిబంధన ఏదీ లేదని చద్దా గుర్తుచేశారు. దేశంలోని 90 శాతం మంది ఉద్యోగులు ప్రైవేట్ రంగంలోనే ఉన్నారని, దీనివల్ల అత్యధిక మంది తండ్రులు ఈ సౌకర్యానికి దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

స్వీడన్, ఐస్‌లాండ్, జపాన్ వంటి దేశాలు 90 రోజుల నుంచి 52 వారాల వరకు పితృత్వ సెలవులు కల్పిస్తున్నాయని ఉదహరించారు. బిడ్డ సంరక్షణ, ఉద్యోగం రెండింటి మధ్య తండ్రి దేన్ని ఎంచుకోవాలన్న పరిస్థితి రాకూడదని, అదే సమయంలో భర్త మద్దతు లేకుండా తల్లి ప్రసవ వేదనను ఎదుర్కోకూడదని అన్నారు. కావున ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని, పితృత్వ సెలవును చట్టబద్ధమైన హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Related posts

మణిపూర్ లో భారత మాతను చంపేశారు.. లోక్ సభలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

Ram Narayana

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. విపక్షాల ఆందోళనతో ఎల్లుండికి వాయిదా!

Ram Narayana

పక్క పక్కనే కూర్చొని… ఆప్యాయంగా పలకరించుకున్న మోదీ, రాహుల్ గాంధీ!

Ram Narayana