ఏపీలోని ఆలయాల్లో అర్చకులు నిర్వహించే పూజలకు సంబంధించి హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆలయ ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగమ శాస్త్ర నియమాలు, శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాలు, రాష్ట్ర దేవాదాయ శాఖ గతంలో జారీ చేసిన సర్క్యులర్‌ను కఠినంగా అమలు చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 30న తుది ఉత్తర్వులు ఇచ్చారు.
విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డీఎస్‌ఎస్‌ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజి ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. 2010లో ధార్మిక పరిషత్ జారీ చేసిన సర్క్యులర్‌ను, శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు మహాతీర్థ భారతీస్వామి విడుదల చేసిన ప్రామాణికను ఆలయాల్లో సరిగ్గా అమలు చేయడం లేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం అర్చకులకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని గుర్తుచేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లినా, తిరిగి వచ్చాక గర్భగుడిలో పూజలు చేసే అర్హతను వారు కోల్పోతారని స్పష్టం చేశారు. అలాంటి అర్చకులు కేవలం ఆలయ ప్రాంగణంలో బయట జరిగే వ్రతాలు, ఇతర పూజా కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనవచ్చని వివరించారు.
శృంగేరి పీఠం ప్రామాణిక ప్రకారం.. త్రికాల సంధ్యావందనం, వేద అధ్యయనం, గురు ఉపదేశ మంత్ర జపం, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఉండేవారు మాత్రమే గర్భగుడిలో పూజలకు అర్హులని తెలిపారు. విదేశాలకు వెళ్లి సంప్రదాయాలకు విరుద్ధంగా క్షవరం, జుట్టు కత్తిరించుకున్న వారు కూడా అనర్హులని కోర్టుకు నివేదించారు.
ఈ వాదనలపై స్పందించిన దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది, శృంగేరి పీఠం మార్గదర్శకాలు, శాఖాపరమైన సర్క్యులర్‌ను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోని ఆలయాల్లో అర్చకుల నియామకాలు, పూజల విషయంలో ఈ నిబంధనలు కీలకం కానున్నాయి.