అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధం సృష్టించిన మానవ విషాదానికి అద్దం పడుతూ.. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మరణించిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్విగ్నతకు కారణమైంది.
ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్‌కు బయలుదేరిన విమానంలో ముందు వరుస సీట్లలో ఈ వస్తువులను ఉంచి, వాటిని యుద్ధ బాధితులకు ప్రతీకగా అభివర్ణించింది. “ఈ ప్రయాణంలో నా సహచరులు #Minab168” అంటూ ఘలీబాఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో అందరినీ కలచివేసింది.
యుద్ధం ప్రారంభమైన తొలి రోజైన ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపినట్లు ఆరోపిస్తున్న దాడుల్లో 168 మంది పాఠశాల విద్యార్థులు మరణించారు. వారి జ్ఞాపకార్థం ఇరాన్ తమ ప్రతినిధి బృందానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టింది. ఈ చర్చల్లో ప్రధానంగా టెహ్రాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల కాల్పుల విరమణపై చర్చించనున్నారు.
ఈ చర్చల కోసం ఇరాన్ బృందానికి స్పీకర్ ఘలీబాఫ్, అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. 2011 తర్వాత ఒక అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.