జాతీయ వార్తలు

ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదా రోడ్లు శుభ్రం చేయాల్సిందే!

మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బుర్హాన్‌పూర్ జిల్లాలోని బోర్సర్ అనే ఈ పల్లెలో ఎవరైనా అసభ్య పదజాలం వాడితే కఠిన శిక్ష తప్పదు. నోరు జారిన వారికి రూ.500 జరిమానా లేదా గంటపాటు గ్రామ వీధులను శుభ్రం చేయాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. సభ్యత, మర్యాదను పెంపొందించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది.

గ్రామ సర్పంచ్ అంతర్ సింగ్, ఉప సర్పంచ్ వినోద్ షిండే, సామాజిక కార్యకర్త అశ్విన్ పటేల్ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గతంలో సుమారు 6,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో చిన్న పిల్లలు సైతం బహిరంగంగా బూతులు మాట్లాడుతూ గొడవలకు దిగేవారు. ఈ దుర్భాష కారణంగా గ్రామ వాతావరణం దెబ్బతింటోందని భావించి, ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ఈ నిబంధనపై అధికారికంగా తీర్మానం చేసి, ఊరంతా పోస్టర్లు అంటించింది.

ఈ నియమం అమలులోకి వచ్చాక గ్రామంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గ్రామస్థులంతా సభ్యతతో కూడిన భాష వాడతామని ప్రతిజ్ఞ చేశారు. 20 మందికి పైగా వార్డు సభ్యులు నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో ఈ నియమం సమర్థంగా అమలవుతోంది. ఈ మార్పుతో ఇప్పుడు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, ముఖ్యంగా మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని సర్పంచ్ తెలిపారు.

అసభ్య భాష నిర్మూలనతో పాటు గ్రామంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం, ప్రధాన కూడళ్లలో ఉచిత వై-ఫై సౌకర్యం కల్పించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ సంస్కరణల ఫలితంగా బోర్సర్ గ్రామం ఇప్పుడు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి.. !

Ram Narayana

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: సరిపోని కొన్ని డీఎన్‌ఏ నమూనాలు..

Ram Narayana

ఐజ్వాల్‌కు రైలు వచ్చేసింది.. చారిత్రాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ!

Ram Narayana