ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు విఫలం కావడంతో ఓ సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి బీఎండబ్ల్యూ కారుపై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ న్యాయవాది అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ వైపు వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ కీసర టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే బ్రేకులు పని చేయలేదు. దీంతో అదుపుతప్పిన ట్యాంకర్, ముందు వెళుతున్న కారు (TS 09 FT 6662) మీదకు దూసుకెళ్లి బోల్తా పడింది. భారీ ట్యాంకర్ కింద కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ట్యాంకర్‌ను తొలగించేందుకు క్రేన్లు, జేసీబీలను రంగంలోకి దించారు. సుమారు గంటపాటు శ్రమించి ట్యాంకర్‌ను పక్కకు తీసి, కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని వెలికితీశారు. వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా కారు యజమాని హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.