గణేశ్ నిమజ్జన సమస్యలపై మీకసలు పట్టింపే లేదా?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు!
-పది నిమిషాల ముందు రిపోర్ట్ ఇస్తారా?
-సీపీకి నివేదిక ఇచ్చే టైం కూడా లేదా?
-సలహాలు కాదు.. చర్యలు కావాలని సర్కార్ కు చురక
-తామే ఇక ఆదేశాలిస్తామని స్పష్టీకరణ
వినాయక నిమజ్జనాలు, పండుగ ఏర్పాట్ల వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినా నివేదికలను సమర్పించరా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. అంత తీరిక లేకుండా ఉన్నారా? అంటూ మండిపడింది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని కోరుతూ గతంలో మామిడి వేణుమాధవ్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి. వినోద్ కుమార్ ల ధర్మాసనం ఇవాళ విచారించింది.
నిమజ్జన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేనట్టుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమజ్జన ఆంక్షలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హోల్డ్ లో పెట్టింది. విచారణకు పది నిమిషాల ముందు నివేదికలు ఇవ్వడం పట్ల జీహెచ్ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. నివేదిక ఇచ్చేంత తీరిక కూడా పోలీస్ కమిషనర్ కు లేదా? అని నిలదీసింది. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. పండుగకు జనం గుంపులుగా ఉండకుండా చర్యలేం తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది.
అయితే, 48 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశామని, మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పిన సమాధానంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సలహాలు ఇవ్వడం కాదని, చర్యలు కావాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని, తామే ఆదేశాలు ఇస్తామని తేల్చి చెప్పింది.
నిమజ్జనం విషయంలో తెలంగాణ సర్కార్ ఇచ్చిన నివేదిక తో సంతృప్తి చెందని హైకోర్టు ,అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ప్రజలు వినాయక మండపాల వద్ద గుంపులుగా లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో ప్రభుత్వం విరకటంలో పడినట్లు అయింది.