స్పీడ్ పెంచిన భట్టి … రైతు భరోసా యాత్రలతో హల్చల్
-రైతులతో ముఖాముఖీ
-వ్యవసాయ చట్టాలు రద్దు కావాల్సిందే
-సాగర్ లో భారీ మైజార్టీ తో కాంగ్రెస్ గెలుపు ఖాయం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పొలం బాట పట్టారు …. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన ఆయన యాత్రకు రైతులనుంచి అపూర్వ స్పందన రావడం విశేషం …. ఎడ్ల బండ్ల పై ఊరేంగింపులు … డప్పుల చప్పుళ్ళు ,సమావేశాలు , రైతులతో ముఖాముఖీలతో చేస్తున్న యాత్రలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. విక్రమార్క చేపట్టిన ఈ యాత్రలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది … కాంగ్రెస్ మీటింగులకు వస్తున్నా ఆదరణ ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని అందువల్ల బెదిరింపులకు సైతం పాల్పడుతుందని తెలంగాణ రైతులు బెదిరింపులకు భయపడే వారు కాదని గురుంచుకోవాలని భట్టి అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా 70 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ 10 రోజులపాటు రైతులకు మద్దతుగా దేశవ్యాపితంగా యాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చింది . దీంతో తెలంగాణాలో సీఎల్పీ నేత భట్టి పొలంబాట పట్టారు ….. రైతు భరోసా యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఆయా జిల్లాలో రైతులతో ముఖాముఖీ నిర్వహిస్తున్నారు. వారి అడుగులో అడుగు వేస్తున్నారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేస్తున్నారు. రైతుల అభిప్రాయాలూ తెలుసుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని రైతులకు సులభమైన పద్దతిలో వివరిస్తున్నారు . వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు .
ఆదిలాబాద్ నుంచి జిల్లాలోని బింసా నుంచి ప్రాతంభించిన తన 10 రోజుల యాత్ర తో రైతుల్లో ఉత్సహాన్ని నింపుతుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పై పదునైన మాటలతో విమర్శనా అస్త్రాలు సంధిస్తున్నారు . నీరు ,నిధులు , నియామకాలు అన్నావు అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయింది ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చావా ? కేసీఆర్ అంటూ నిలదీస్తున్నారు. రైతు చట్టాలను రద్దుచేయాలని చెప్పి ఉద్యమంలో పాల్గొని ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత నోరు ఎందుకు తెరవటం లేదని ప్రశ్నించారు. నీ నోటి దగ్గర కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెల్ల ఉసిరి ఏమైనా పెట్టారా కేసీఆర్ అని అడుగుతున్నారు. ప్రాజెక్టు లు అన్నావు కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది నిజంకాదా? కాకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు సిద్దమేనా ? అని అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 19 కి .మీ దిగువకు కట్టారని అంటున్నావు. నువ్వు కాళేశ్వరం 100 కి.మీ దిగువకు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం ఎందుకు చేశావని ప్రశ్నించారు. నోరు తెరిస్తే అబద్దాలేనా అంటూ ఆయా సభలలో సిఎం పై నిప్పులు చెరుగు తున్నారు. సీఎల్పీ నేత విమర్శలపై సీఎం కేసీఆర్ సైతం నల్లగొండ జిల్లా హాలియా బహిరంగ సభలో స్పందించారు.
గత ఎన్నికలకు ముందే రాష్ట్రంలో యాత్ర చేయాలనీ సంకల్పించిన భట్టి రూట్ మ్యాప్ కూడా
తయారు చేసుకున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించుకున్నారు. పార్టీ అనుమతి లేకనో , లేక వ్యక్తిగత కారణాల వల్లనో తెలియదు కానీ తనయాత్రను రద్దు చేసుకున్నారు. ఎన్నికలలో ప్రచార కమిటీ చైర్మన్ గా రాష్త్రం లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ప్రచారం సైతం జరిగింది. కానీ ఓటమి చెందింది.గత శాశనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన జానారెడ్డి ఓడిపోయారు . కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యే లు ఎన్నికైయ్యారు. అందులో ఖమ్మం జిల్లా నుంచే 6 గురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అభ్యర్థుల ఎంపికలో భట్టి తన ముద్ర వేయించుకోగలిగారు. ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువమంది శాశనసభ్యులు కాంగ్రెస్ కావడం భట్టిని , సీఎల్పీ నేతగా చేసింది . ఉన్నత విద్యావంతుడు, ఇంగ్లీష్ , హిందీ భాషలలో మంచి పట్టు ఉండటంతో అటు కేంద్ర పెద్దలతోను ,రాష్ట్రంలో అధికారులతో, పార్టీ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అధిష్టానం సైతం ఆయన తేలితేటలను గమనించి ప్రమోట్ చేయాలనే ఆలోచనతో అవకాశాలను కల్పిస్తుంది . దీంతో రాష్ట్ర రాజకీయాలలో కీలక నేతగా మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ప్రాబబుల్స్ లో ఒకరిగా ఉన్నారు . వైయస్ సహకారంతో రాజకీయాలలో అడుగు పెట్టిన భట్టి ఆంధ్ర బ్యాంకు డైరక్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం కాంగ్రెస్ శాశనసభ పక్ష నేతగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయించుకున్నారు.ఖమ్మం జిల్లాలోని మధిర ఎస్సీ రిజర్వేడ్ నియోజకవర్గం నుంచి మూడవసారి శాశనసభకు ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు.ఉన్నత విద్యావంతుడైన భట్టి విక్రమార్క పేరుకు తగ్గట్టుగానే తాను తలుచుకున్నది సాధించటంలో నిజంగా విక్రమార్కుడే అనడంలో అతిశయోక్తి కాదు. .వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన శాశనసభలో ప్రభుత్వ విప్ గా వ్యవహరించారు.రెండవసారి వైయస్ అధికారంలోకి వచ్చినతరువాత ప్రభుత్వ చీఫ్ విప్ గా సమర్థవంతంగా భాద్యతలు నిర్వర్తించారు. అనంతరం శాశనసభ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు.
సాగర్ లో భారీ మెజార్టీ తో గెలవబోతున్నాం
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మైజార్టీ తో గెలవబోతుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగర్ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని కాంగ్రెస్ కు పట్టం కట్టబోతున్నారని అన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణాలో నచ్చిన పరిపాలన లేదని ప్రజలు అభిప్రాయం పడుతున్నారని అన్నారు. అందుకే 2023 కేసీఆర్ పర్మినంట్ గా ఫామ్ హౌస్ కేపరిమితం అవుతారని జోశ్యం చెప్పారు . భట్టి వెంట ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు. ఈ యాత్ర పది రోజుల పాటు కొనసాగుతుందని భట్టి తెలిపారు.