నష్ట నివారణకు ఇదే చివరి అవకాశం.. సోనియాకు 13 పాయింట్లతో సిద్ధూ లేఖ…
-చర్చించేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి
-లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పంజాబ్ పీసీసీ చీఫ్
-వచ్చే ఏడాది ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధత
పంజాబ్ లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య గొడవతో కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. ఇటీవలే అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా కూడా చేశారు. ఆ తర్వాత చరణ్ జిత్ సింగ్ చన్నీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం.. కొన్ని రోజులకే సిద్ధూ పీసీసీ పదవికి రాజీనామా చేయడం జరిగిపోయాయి. తాజాగా రాహుల్ ను కలిసిన సిద్ధూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం 13 పాయింట్ల అజెండాను అమలు చేయాలంటూ తాజాగా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. ఇవాళ ఆ లేఖను ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. దైవదూషణ కేసుల్లో న్యాయం, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నివారణ, విద్యుత్ కష్టాలు, పీపీఏలు, వ్యవసాయ సమస్యలు, ఉపాధి కల్పన, ఇసుక మైనింగ్, ఎస్సీ–బీసీల సంక్షేమం, సింగిల్ విండో సిస్టమ్, మహిళలు–యువత సాధికారత, మద్యం, రవాణా రంగం, కేబుల్ మాఫియా వంటి సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు.
ఈ అంశాలన్నింటిపై మాట్లాడేందుకు, చర్చించేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా సోనియాను లేఖలో ఆయన కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు జరిగిన నష్టాన్ని నివారించేందుకు ఇదే చివరి అవకాశమని, ఇకనైనా వాటిని సరిచేసుకుంటే మంచిదని ఆయన లేఖలో పేర్కొన్నారు.