మావోలకు కరోనా ఎఫెక్ట్ …అగ్రనేతలకు అనారోగ్యం!
కరోనా టీకాలు తీసుకున్న వందలాదిమంది నక్సల్స్
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు దంపతుల వెల్లడి
విషమంగా రఘు, రాజేశ్ ఆరోగ్యం
ఏపీ, తెలంగాణ నుంచి మావోలకు చేరిన టీకాలు
లొంగిపోతే ప్రాణాలు కాపాడతామన్న పోలీసులు
అడవుల్లో ఉన్న మావోలు కరోనా భారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రత్యేకించి ఛత్తీస్ ఘడ్ లోని పలు ప్రాంతాలలో తలదాచుకుంటున్న వారు కరోనా టీకాలను సైతం వేయించుకున్నారు. అయితే అందుకు వారు ఛత్తీస్ ఘడ్ నుంచి కాకుండా తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించుకున్న టీకాలు మందులు వాడటం గమనార్హం …
దంతెవాడ పోలీసుల ఎదుట మొన్న లొంగిపోయిన మావోయిస్టు దంపతులు పొజ్జో, లఖ్కె సంచలన విషయాలను వెల్లడించారు. మావోయిస్టు అగ్రనేతలు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. అలాగే, దాదాపు 700 మంది మావోయిస్టులు కరోనా టీకాలు వేయించుకున్నట్టు పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లో టీకాలపై అనుమానంతో ఏపీ, తెలంగాణ నుంచి టీకాలను తెప్పించుకున్నట్టు వివరించారు. టీకాలతోపాటు చికిత్సకు అవసరమైన ఔషధాలు కూడా మావోయిస్టులకు చేరాయన్నారు.
మావోయిస్టు దక్షిణ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నారని హిడ్మా, సుజాత, వికాస్, రఘుతోపాటు పలువురు మావోయిస్టు అగ్రనేతలు కొవిడ్ టీకాలు తీసుకున్నట్టు తెలిపారు. దక్షిణ బస్తర్ విభాగం ఇన్‌చార్జ్ రఘు, మాసా బెటాలియన్ కమాండర్ రాజేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, బహుశా వారికి కరోనా సోకి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వారు కర్రల సాయంతో నడుస్తున్నారని, ఆరోగ్యం కొంత విషమంగానే ఉందని తెలిపారు.
రఘుపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న మావోలు లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టు దంపతులు పొజ్జో, లఖ్కె అసలు పేర్లు సంజు మాద్వి, తులసి మాద్వి. వీరిపై పలు కేసులు ఉన్నాయి. 70 మంది జవాన్ల హత్య కేసుతోపాటు భద్రతా దళాలపై జరిగిన 12 దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. గతంలో వీరిపై రూ. 5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.