ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన మయన్మార్ సైనిక పాలకులు!
- గత ఫిబ్రవరిలో మయన్మార్ లో సైనిక తిరుగుబాటు
- ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేజిక్కించుకున్న సైన్యం
- ఆంగ్ సాన్ సూకీ, ఇతర నేతల నిర్బంధం
- అవినీతి, మోసాలు, తదితర అభియోగాలు మోపిన వైనం
సైనిక పాలనలో కొనసాగుతున్న మయన్మార్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిర్బంధంలో ఉన్న పౌరనేత ఆంగ్ సాన్ సూకీకి మయన్మార్ సైనిక పాలకులు నాలుగేళ్ల జైలుశిక్ష విధించారు. సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నారన్నది ఆంగ్ సాన్ సూకీపై ప్రధాన ఆరోపణ. అంతేకాదు కరోనా సంక్షోభ సమయంలో మార్గదర్శకాలను అతిక్రమించారని కూడా సైనిక ప్రభుత్వం తీర్పు సందర్భంగా పేర్కొంది.
గత ఫిబ్రవరిలో మయన్మార్ సైన్యం అక్కడి పౌర ప్రభుత్వాన్ని కూల్చివేయడం తెలిసిందే. దేశాధికారాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న సైన్యం… తనకు ఎదురులేకుండా ఉండేందుకు ఆంగ్ సాన్ సూకీ, ఇతర కీలకనేతలను నిర్బంధించింది. అంతేకాదు, వారిపై వివిధ రకాల ఆరోపణలతో జైలుపాలు చేస్తోంది.