పోలింగ్ కోసం సర్వం సిద్ధం …ఖమ్మం కలెక్టర్ ,పోలీస్ కమిషనర్!
-ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు పోలింగ్ కేంద్రాలు
-ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల స్థానానికి ఓటు హక్కును -వినియోగించుకోనున్న 768 ఓటర్లు
-ఓటర్లలో 6 గురు నిరక్షరాస్యులు… వారికీ మరొకరి సహాయం …
ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. గురువారం డి.పి.ఆర్.సి భవనంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీసు కమీషనర్ విష్ణు.యస్.వారియర్ తో కలిసి పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 768 మంది ఓటర్లు ఈ నెల 10న జరుగనున్న పోలింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, అందుకు గాను నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయపు పోలింగ్ కేంద్రంలో 84 మంది, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 221 మంది, కల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 115 మంది అదేవిధంగా ఖమ్మం రెవెన్యూ డివిజన్ కార్యాలయపు పోలింగ్ కేంద్రంలో 348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని కలెక్టర్ తెలిపారు. వీరిలో 314 మంది పురుషులు కాగా 454 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రాచలం పోలింగ్ కేంద్రంలో 9 మంది జడ్పీ.టి.సిలు, 75 మంది ఎం.పి.టి.సిలు, కొత్తగూడెం పోలింగ్ కేంద్రంలో 60 మంది కౌన్సిలర్లు, 14 మంది జడ్పీ.టి.సి.లు, 145 మంది ఎం.పి.టి.సిలు, ఇద్దరు ఎక్స్ అఫీసియో సభ్యులు, కల్లూరు పోలింగ్ కేంద్రంలో 23 మంది కౌన్సిలర్లు, 6 గురు జడ్పీ.టి.సిలు, 85 మంది ఎం.పి.టి.సిలు, ఒక్కరు ఎక్స్ అఫీసియో సభ్యులు కాగా ఖమ్మం పోలింగ్ కేంద్రంలో 60 మంది కార్పోరేటర్లు, 42 మంది కౌన్సిలర్లు, 16 మంది జడ్పీ.టి.సిలు, 224 మంది ఎం.పి.టి.సిలు, 6 గురు ఎక్స్ అఫీసియో సభ్యులు ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు గాను పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, సి.సి కెమెరాలు, వెబ్కాస్టింగ్, వీడియో గ్రఫీ తదితర ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు ఇద్దరు ఓ.పి.ఓలను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇట్టి పోలింగ్ సిబ్బందికి నవంబరు 30 వ తేదీన మొదటి విడత, డిశంబరు 6 వ తేదీన 2వ విడత శిక్షణ తరగతులను నిర్వహించి పోలింగ్ నిర్వహణకు సంసిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిన పోలింగ్ జరుగునున్న నేపథ్యంలో 9 వందల బ్యాలెట్ పేపర్లు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుండి అందాయని వాటిలో 9 బ్యాలెట్ పేపర్లను డిఫెక్టివ్ గా గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ బాక్సులను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. డి.పి.ఆర్.సి భవనంలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రంతో పాటు స్ట్రాంగ్రూమ్ను ఏర్పాటు చేసామన్నారు. పోలింగ్ సిబ్బంది సామాగ్రి రవాణాకు గాను నాలుగు రూట్లుగా గుర్తించి ప్రతి రూట్కు ఒక వాహనం కేటాయించామన్నారు. కొత్తగూడెం, భద్రాచలంకు రెండు బస్సులను అదనంగా పంపిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా రెండు డోసులు టీకా తీసుకున్న వారిని మాత్రమే పోలింగ్ సిబ్బందిగా నియమించామని, అదేవిధంగా పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెండు డోసులు టీకా తీసుకొని ఉండేవిధంగా చర్యలు తీసుకోన్నట్లు కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ రోజు సీక్రసీ ఆఫ్ ఓటింగ్ను ఖచ్చితంగా పాటిస్తున్నామని ఓటింగ్ కంపార్ట్మెంట్లో కేవలం ఓటరుకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఓటింగ్ కంపార్టుమెంట్లో ఫోటో, వీడియో గ్రఫీ నిషేధించబడిందని కలెక్టర్ తెలిపారు. 768 మంది ఓటర్లలో కేవలం 6 గురు మాత్రమే నిరక్షరాస్యులుగా గుర్తించి వారి అభ్యర్థన మేరకు వారు ఓటుహక్కు వినియోగించుకొనేందుకు మరొకరి సహాయానికి అనుమతించడం జరిగిందని, మిగిలిన ఓటర్లెవరికి కూడా సహాయకులను అనుమతించబడదని కలెక్టర్ వివరించారు. శాసనమండలి ఎన్నికలలో ఓటరు ప్రాధాన్యతపరంగా ఓటు వేయవలసి ఉంటుందని, ఎన్నకల సంఘంచే ఇవ్వబడిన వాయిలెట్ కలర్ పెన్నును మాత్రమే ఉపయోగించి నెంబర్లను సూచించడం ద్వారా మొదటి, రెండవ, మూడవ, నాల్గవ ప్రాధాన్యతను సూచించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
పోలీసు కమీషనర్ విష్ణు. యస్. వారియర్ మాట్లాడుతూ పోలింగ్ బందోబస్తుకు మొత్తం 12 వందల మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టబందోబస్తు చర్యలు చేపట్టామని, రూటు మోబైల్లో ఒక స్టేషన్ హౌజ్ ఆఫీసర్తో పాటు ఇద్దరు ఆర్మ్ గార్డులను కేటాయించామని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రంలో లోకేషన్లో ప్రత్యేక క్లాక్ రూమ్ను ఏర్పాటు చేసామని, పోలింగ్ కేంద్రానికి వెళ్ళేముందు సెల్ఫోన్లు, పెన్నులు, ఇతర వస్తువులు ఇట్టి క్లాక్ రూమ్లో అప్పగించి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళే సమయంలో తిరిగి పొందాల్సి ఉంటుందని, బుధవారం సాయంత్రం నుండే “డ్రై డే” అమల్లో ఉందని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఈ సందర్భంగా పోలీసు కమీషనర్ తెలిపారు.
అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎన్. మధుసూదన్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.