పెళ్లి జరుగుతుండగా కాల్పులు.. ఒకరి మృతి
- మధ్యప్రదేశ్‌లోని మండసోర్ జిల్లాలో ఘటన
- 11 మంది నిందితులను గుర్తించిన పోలీసులు
- నలుగురి అరెస్టు
పెళ్లి జరుగుతుండగా కొందరు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని మండసోర్ జిల్లాలోని జామునియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తీయడంతో పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకుని వివరాలు తెలిపారు.
భెసోడి మండి గ్రామంలో బాబా రాంపాల్ అనే మత గురువు, ఆయన అనుచరులు నివసిస్తుంటారు. జామునియా గ్రామంలో జరిగిన ఓ వివాహానికి బాబా అనుచరులు వచ్చారు. అయితే, పెళ్లికి బాబా అనుచరులు రావడాన్ని కొందరు గ్రామస్థులు వ్యతిరేకించారు. దీంతో వారు కోపంతో ఊగిపోయారు. పెళ్లి ముహూర్తం సమయంలో గుంపుగా వచ్చిన గ్రామస్థులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేస్తూ కాల్పులు జరిపారు.
దీంతో పెళ్లికి అతిథిగా వచ్చిన గ్రామ పెద్ద దేవీ లాల్ మీనా గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. పెళ్లిలో హింసకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, 11 మంది నిందితులను గుర్తించారు. వారిలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.