లోకసభ లో దుమారం …లకింపుర్ ఘటన పెద్ద కుట్ర: రాహుల్ ధ్వజం
-రైతుల హత్యలు సర్కార్ హత్యలే..వీటికి మూల్యం చెల్లించక తప్పదు
-ఆ మంత్రి పెద్ద నేరస్థుడు.. లఖింపూర్ ఖేరి ఘటనపై రాహుల్ మండిపాటు
-దద్దరిల్లిన లోక్ సభ…మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
-కచ్చితంగా లఖింపూర్ ఘటన కుట్రేనన్న రాహుల్
లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ నేరస్థుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ లో రైతుల హత్యలు సర్కార్ హత్యలే …ఇందుకు మూల్యం చెల్లించక తప్పదని అన్నారు . లోక్ సభ సమావేశాల్లో లఖింపూర్ ఖేరి ఘటనపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుట్ర ప్రకారం చేసిన దాడి అంటూ సిట్ అధికారులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అరుపులతో సభ మొత్తం దద్దరిల్లింది. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
అనంతరం పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మీడియాతోనూ మాట్లాడారు. లఖింపూర్ ఖేరి ఘటన ఓ కుట్రంటూ నివేదిక ఇచ్చారని, కచ్చితంగా అది కుట్రేనని ఆయన అన్నారు. ఎవరి కుమారుడికి ఆ ఘటనలో హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. ‘దానిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందే. కానీ, అందుకు ప్రధాని ఒప్పుకోవడం లేదు. మంత్రిని వెనకేసుకొస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో రైతులపైకి మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ లోని ఓ కారు ఎక్కించడంతో నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సమయంలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సదరు కారులో ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రైతులు చేసిన దాడిలో మరో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు.