కళ్లలో కారం కొట్టి గొలుసు లాక్కెళ్లే యత్నం.. అదే కారం అతడి కళ్లల్లో కొట్టి పట్టుకున్న మరో మహిళ
- తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
- చిప్స్ ప్యాకెట్ అడిగి కళ్లలో కారం కొట్టిన దొంగ
- మరో మహిళ తెగువతో చిక్కిన నిందితుడు
కిరాణా దుకాణానికి వచ్చి కళ్లలో కారం కొట్టి గొలుసు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడో దొంగ.. అదే సమయంలో అక్కడికొచ్చిన ఓ మహిళ అతడు తెచ్చిన కారాన్ని అతడి కళ్లలోనే కొట్టి అతడిని పట్టుకుంది. తెలంగాణలోని కామారెడ్డిలో ఈ ఘటన జరిగింది. తెగువ చూపించిన ఆ మహిళపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. స్థానిక శివాజీరోడ్డు చౌరస్తా వద్ద ఉన్న కిరాణా దుకాణానికి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి చిప్స్ ప్యాకెట్ కావాలని అడిగాడు. ఆమె తీసి ఇస్తున్న సమయంలో జేబులోంచి కారం పొడి తీసి ఒక్కసారిగా ఆమె కళ్లలో కొట్టాడు. ఆమె బాధతో విలవిల్లాడుతున్న సమయంలో మెడలోని బంగారు పుస్తెలతాడును తెంపుకుని బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో కిరాణషాపునకు వచ్చిన భారతి అనే మహిళ దొంగను చూసి వెంటనే అప్రమత్తమైంది. కిందపడి ఉన్న కారం పొట్లాన్ని అందుకుని అందులో కారం తీసి దొంగ కళ్లలో కొట్టింది. అతడు మంటతో అల్లాడుతున్న సమయంలో పట్టుకుని కేకలు వేసింది. అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని సదాశివనగర్‌కు చెందిన మ్యాదరి యాదగిరిగా గుర్తించారు.