అఖిలేశ్ యాదవ్ కల నెరవేరే ప్రసక్తే లేదు: తేల్చిచెప్పిన అమిత్ షా
జన్‌విశ్వాస్ యాత్రలో పాల్గొన్న అమిత్ షా!
-వచ్చే ఎన్నికల్లో బీజేపీ 300కుపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా
-రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్న కేంద్రమంత్రి
ఇంకా ఎన్నికల షడ్యూల్ రాలేదు …కరోనా ,ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. అయినప్పటికీ రాజకీయపార్టీల ర్యాలీలు ఆగటంలేదు . ఒకపక్క కేంద్రం రాష్ట్రాలపై నిబంధనలు పెడుతూనే మరో పక్క ప్రధాని ,హోంమంత్రిలాంటి పెద్ద నాయకులూ ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. సహజంగానే వారి సభలకు లక్షలాది మందిని ప్రజలను సమీకరిస్తుంటారు . మరి వారికీ లేని నిబంధనలు రాష్ట్రాలకు ఎందుకనే ప్రశ్నకు సమాధానం లేదు . ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మళ్ళీ రామమందిరం నినాదాన్ని లంకించుకున్నారు . ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ రామమందిర నిర్మాణాన్ని ఆపుతానని అన్నారని దాన్ని ఆపటం ఎవరి తరం కాదని అన్నారు.
తాము అధికారంలోకి వస్తే రామ మందిర నిర్మాణాన్ని ఆపేస్తామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అంటున్నారని, ఆయన కలలు నెరవేరవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని, అది జరగని పని అని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జలాన్‌లో బీజేపీ నిన్న నిర్వహించిన ‘జన్ విశ్వాస్’ యాత్రలో పాల్గొన్న షా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఆ రెండూ కులతత్వ పార్టీలని దుమ్మెత్తిపోశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సబ్ కా సాత్.. సబ్ కా వికాశ్ నినాదంతో ముందుకెళ్తున్నారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని సమాజ్‌వాదీ పార్టీ కలలు కంటోందని, అది ఎప్పటికీ జరగదన్న అమిత్ షా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పారు.