లోకల్ మాఫియా చెలరేగిపోతోంది.. సామాన్యుడికి భద్రత కరవైంది: ఎమ్మెల్యే ఆనం!
- రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం బాగా తగ్గాయి
- లోకల్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారు
- పోలీసులపై సామాన్యులకు నమ్మకం పోతోంది
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం బాగా తగ్గాయని, అయితే, స్థానిక మాఫియా మాత్రం చెలరేగిపోతోందని అన్నారు. కొందరు పోలీసులు కూడా లోకల్ మాఫియాతో చేతులు కలిపారని, దీంతో సామాన్యులకు భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటగిరి 9వ బెటాలియన్‌లో నిన్న జరిగిన స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల్లో నమ్మకం, భరోసా కల్పించాల్సిన పోలీసులే ఇలా మాఫియాతో చేతులు కలపడం బాధాకరమన్నారు. పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం సామాన్యుల్లో రోజురోజుకు సన్నగిల్లుతోందన్నారు. అయినా.. పోలీసులు, మాఫియా కలిశాక సామాన్యులకు భద్రత ఇంకెక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అయితే, తాను పోలీసులందరినీ నిందించడం లేదని, కొందరు మాత్రమే ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అలాంటి కలుపు మొక్కలను ఏరిపారేస్తేనే సమాజం బాగుపడుతుందని ఆనం పేర్కొన్నారు.