అడ్డువచ్చిన బాలుడిని తొక్కుకుంటూ వెళ్లిన రాయల్ గార్డు..
- బ్రిటన్‌లోని టవర్ ఆఫ్ లండన్ ప్రాంతంలో ఘటన
- నిబంధనల ప్రకారం కవాతు ఆపకూడదు
- గార్డుపై నెటిజన్ల విమర్శలు
బ్రిటన్‌లో రాయల్ గార్డు కవాతు చేస్తోన్న సమయంలో ఓ బాలుడు అడ్డు వచ్చాడు. మధ్యలో కవాతు ఆపకూడదని నిబంధనలు ఉండడంతో ఓ రాయల్ గార్డు ఆ బాలుడిని అలాగే తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. టవర్ ఆఫ్ లండన్ ప్రాంతం సందర్శకులతో నిండిపోయిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు రాయల్ గార్డులు కవాతు చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ బాలుడు ఓ గార్డుకు అడ్డుగా వచ్చిన విషయం గురించి తమకు తెలిసిందంటూ ఈ ఘటనపై స్థానిక రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. ఆ సమయంలో సందర్శకులు ఉన్న ప్రాంతం మీదుగా గార్డులు కవాతు చేసుకుంటూ వస్తున్నారని ప్రజలను ముందస్తుగానే హెచ్చరించామని తెలిపింది.
అయినప్పటికీ, సైనికులు కవాతు చేసుకుంటూ వస్తున్న చోట ఓ బాలుడు నిలబడి ఉన్నాడని, ఆ సమయంలో సైనికుడికి ఆ బాలుడు అతి సమీపంలోకి వెళ్లినట్లు అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ బాలుడిని గుర్తించిన సైనికుడు అతడిని దాటేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో ఆ బాలుడు కిందపడిపోయాడని వివరించింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ బాలుడిని సైనికుడు పరామర్శించినట్లు తెలిపింది.
కాగా, ఆ గార్డు బృందం బ్రిటన్‌లోని రాచరిక నివాసాలకు భద్రత కల్పిస్తుంది. సైనికులు అటుగా వస్తున్న సమయంలో ఆ బాలుడు అక్కడ ఎందుకు నిలబడ్డాడని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పిల్లాడు అడ్డువచ్చినప్పటికీ, పక్కకు జరగని సైనికుల తీరుపై మరి కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.